దోసుకున్న పైసలతోనే కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దోసుకున్న పైసలతోనే కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టిండు :  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గన్నేరువరం,వెలుగు : రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి, ఆ కమీషన్లతోనే కేసీఆర్ సొంత విమానం కొన్నాడని, రూ. వందల కోట్లు ఢిల్లీకి తరలించి ఆ సొమ్ముతోటే జాతీయ పార్టీని పెట్టాడని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లాలోని గన్నేరు వరంలో మండలంలోని కాసింపేట, పారువెల్ల లో బుధవారం ఆయన యాత్ర చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో ప్రవీణ్​కుమార్​కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎస్పీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానం చేస్తే.. కేసీఆర్​ కుటుంబం భోగాలు అనుభవిస్తోందని అన్నారు. మండల కేంద్రంలో నిరుపేదలకు కనీసం ఒక డబుల్ బెడ్ రూమ్​ ఇవ్వలేదని, ప్రజలకు కనీసం ఆస్పత్రి , రోడ్లు, ప్రభుత్వ ఆఫీస్​లు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిలేని వారికి కనీసం ఒక ఎకరం భూమి ఇవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. ఉచిత విద్య, వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ అందించిన ఓటు అనే ఆయుధాన్ని సరైన మార్గంలో వినియోగించుకొని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నిషాని రామచంద్రం, మండల అధ్యక్షుడు కల్లెపెళ్లి భూమయ్య, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.