స్పాట్ లో ఉన్నవారు అడ్డుకుని ఉంటే రమ్య బతికేది

 స్పాట్ లో ఉన్నవారు అడ్డుకుని ఉంటే రమ్య బతికేది
  • గుంటూరు డీఐజీ రాజశేఖర్ బాబు 
  • నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు

గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య ను పాశవికంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడ్ని పట్టుకున్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం నరసరావుపేటలో పట్టుపడే సందర్భంలో తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని కత్తితో చేయి కోసుకుంటుంటే పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. నిందితుడికి ప్రాథమిక చికిత్స చేయించి అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలన్నీ చేయించారు. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇంచార్జ్ డీఐజీ రాజశేఖర్, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, గుంటూరు అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తదితరులు మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు పూర్వపరాలు తెలియజేశారు. 
సెయింట్ మెరిస్ ఇంజనీరింగ్ కాలేజీలో..రమ్య బీటెక్ 3వ సంవత్సరం చదువుతోందని, నిందితుడు శశికృష్ణ మెకానిక్ 9వ తరగతి కూడా చదవలేదని.. అయితే ఇన్ స్టా గ్రామ్ లో రమ్యతో ఆరు నెలల క్రితం పరిచయం  చేసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా జులాయిగా ఉంటున్న నిందితుడు.. 6 నెలల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో రమ్యతో పరిచయం అయినప్పటి నుంచి ఆమె వెంటపడుతూ ప్రేమిస్తున్నానని చెప్పేవాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రెండు నెలల క్రితమే ఇతని గురించి తెలుసుకున్న రమ్య దూరం పెట్టడం ప్రారంభించిందని.. అయితే శశికృష్ణ వెంటపడడం మానుకోలేదన్నారు. అదేకోవలోనే నిన్న అమ్మాయిని ఫాలో అయి.. వేధించాడని.. ఎప్పటిలానే అతని మాటలను తిరస్కరిస్తే.. ఆగ్రహంతో కత్తితీసి పొడిచేశాడన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తే.. అక్కడున్న వారు స్పాట్ లోనే అడ్డుకుని ఉంటే రమ్య బతికేదేమోననిపిస్తోందన్నారు. లేదు అమ్మాయి వెంటనే తన ఫోన్ లో దిశ యాప్ ఉంది కాబట్టి ఎస్ఓఎస్ బటన్ నొక్కి ఉంటే ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి కాపాడేవారని డీఐజీ రాజశేఖర బాబు పేర్కొన్నారు. రమ్య నెల రోజుల క్రితమే నిందితుడి ఫోన్ నెంబర్ ను నెల రోజుల క్రితమే బ్లాక్ చేసిందని.. అప్పుడే కనీసం తల్లిదండ్రులకైనా చెప్పి ఉంటే వారు అనుమానించి తమకు చెప్పేవారేమోనన్నారు. 
సోషల్ మీడియా వేదికగా పరిచయాలపై అందరూ దృష్టిపెట్టాలి
ఈ కేసు విషయంలో నిందితుడిపై వేగంగా చార్జిషీట్ వేసి కఠిన శిక్షలు పడేలా చేస్తామని డీఐజీ రాజశేఖరబాబు తెలిపారు.  ఈ నేరం విషయంలో పోలీసుల పాత్ర ఏమీ లేదని.. పోలీసులకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు కూడా అందలేదన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు.. వేధింపులు చాలా వరకు పోలీసులకే కాదు.. తల్లిదండ్రుల దృష్టికి కూడా వెల్లడం లేదన్నారు. ఈ కేసు విషయం వరకు వస్తే.. రమ్యతో పరిచయం చేసుకున్న శశికృష్ణ 9వ తరగతి కూడా చదవలేదని.. అతడు ప్రేమిస్తున్నానని వేధిస్తుంటే.. పోలీసులకు గాని.. చివరకు తల్లిదండ్రులకు కూడా చెప్పలేకపోయిందన్నారు. రహస్యంగా ఉండే ఇలాంటి విషయాలు బయటకు చెప్పకపోతే దారుణ పరిణామాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.  ఈ మధ్య కాలంలో మూడు కేసుల్లో నిందితుడు 30మంది అమ్మాయిలు.. వివాహితులతో సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాడని.. ఒక బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని పట్టుకోగలిగామన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో పరిచయాలపై అందరూ దృష్టి పెట్టాలని కోరారు. ఎన్జీవోలు, మేధావులు, మహిళలు కలసికట్టుగా ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్లకపోతే.. ప్రమాదం అన్నారు. మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు ట్రాప్ లలో చిక్కుకోకుండా ఉండాలంటే.. క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 
సోషల్ మీడియా వచ్చాక కొత్తకొత్త నేరాలు పెరుగుతున్నాయి
సోషల్ మీడియా వాడకం పెరిగాక సమాజంలో కొత్త కొత్త నేరాలు పెరుగుతున్నాయని, బిల్డప్ ప్రొఫైల్ పెట్టుకుని ట్రాప్ చేస్తున్న ఉదంతాలు పెరిగాయని, సమాజం మొత్తం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని గుంటూరు డీఐజీ రాజశేఖర బాబు, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.ఎన్జీవోలు.. మహిళా సంఘాలు.. సమాజంలో మార్పు కోసం అందరూ భాగస్వాములై చైతన్యం చేయాలని కోరారు. ఘటనలో పోలీసుశాఖలోని వారు.. పోలీసులను నిందించడం సరికాదు.. పోలీసుల పాత్ర.. బాధ్య ఏమీ లేదు కదా.. మా వైపు తప్పేమీ లేదు కదా.. కేసు గురించి ఎలాంటి సమాచారం... అవగాహన లేదు.. అకస్మాత్తుగా జరిగిపోయిందన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని.. వారితో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఇలాంటివి బయటకు రావడం చాలా కష్టం.. కాబట్టి దయచేసి చెబుతున్నాం.. సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త అన్నారు. 
రాజకీయ పక్షాలు అడ్డుపడడం సరికాదు
ఉదయం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేమాన్ని తరలింపును కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకోవడం సరికాదని గుంటూరు డీఐజీ రాజశేఖర బాబు అన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డం పడడం.. సరికాదు.. 24గంటల్లోపే ముద్దాయిని అరెస్టు చేశాం.. ప్రభుత్వం కూడా 24 గంటలు కూడా గడవకముందే స్పందించి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు, ఘటనలో మా వైపు తప్పు ఉంటే చూపండి.. చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకోం.. డెడ్ బాడీ మీద లబ్ది పొందాలనుకుంటే రాంగ్.. పోలీసు శాఖ అనునిత్యం ప్రజల వెంటే ఉన్నా.. మా డ్యూటీని మేం చేస్తాం.. రక్షణ కల్పిస్తాం.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయండి.. అని ఆయన కోరారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఛాటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. అన్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలు కంప్యూటర్.. ఫోన్ల మీద నిఘా పెట్టండి.. ఎవరితో మాట్లాడుతున్నారు.. ఏం మాట్లాడుతున్నారో దృష్టి పెట్టాలన్నారు.