ఇంకా ఫీజులపై జీవో ఇవ్వని రాష్ట్ర సర్కార్

ఇంకా ఫీజులపై జీవో ఇవ్వని రాష్ట్ర సర్కార్
  • 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.లక్షకు పైనే
  • అత్యధికంగా సీబీఐటీలో ఏటా రూ.1.73 లక్షల ఫీజు..
  • మొత్తంగా 81 ప్రైవేటు కాలేజీల్లో భారీగా పెంపు
  • టీఏఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజుల వసూలుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్
  • ఇయ్యాల ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఫీజుల బాంబ్ పేలింది. సర్కారు, ప్రైవేటు కాలేజీల్లో భారీగా ఫీజులు పెరిగాయి. 2022–2025 బ్లాక్ పీరియడ్‌‌కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌మెంట్లు మాత్రం హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని, స్టూడెంట్ల నుంచి లక్షల్లో వసూలు చేసేందుకు రెడీ అయ్యాయి. ముందుగా14 కాలేజీలు హైకోర్టు నుంచి ఫీజుల పెంపునకు పర్మిషన్​ పొందగా.. ఇప్పుడు వాటి సంఖ్య 81కి చేరింది. ప్రస్తుతం 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏడాది ఫీజు రూ.లక్ష పైనే ఉండనుంది. దీంతో పేరెంట్స్‌‌లో ఆందోళన మొదలైంది.

ప్రకటన రాకముందే పెంపు..
రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, వాటిలో 70 వేల దాకా కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇప్పటికే జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని సర్కారు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా ఫీజులు పెరిగాయి. కన్వీనర్ కోటాలో రూ.35 వేల నుంచి 50 వేల దాకా పెరగ్గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో రూ.లక్షకు పెంచారు. అయితే ప్రైవేటు కాలేజీల్లో 2022–2025 బ్లాక్ పీరియడ్‌‌కు ఈ ఏడాది ఫీజులు ప్రకటించాల్సి ఉంది. మేనేజ్‌‌మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు హియరింగ్ నిర్వహించి.. సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఫీజుల పెంపుపై సర్కారు అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. దీంతో ఇప్పటిదాకా 79 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి.. తమకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. మరోపక్క మంగళవారం ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనున్నది. ఈ క్రమంలోనే స్కాలర్ షిప్‌‌‌‌కు అనర్హులైన వారు ఈనెల13 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

బీసీ, ఓసీ విద్యార్థులపై భారం
సర్కారు ఇంటర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు ఇబ్బందులు లేవు. ఎంసెట్‌‌‌‌లో ఏ ర్యాంకు పొందినా వారికి సర్కారే పూర్తి ఫీజు చెల్లిస్తోంది. కానీ ఆయా వర్గాల్లో కుటుంబ ఆదాయం అర్బన్‌‌‌‌లో ఏటా రూ.2 లక్షలు, రూరల్‌‌‌‌లో రూ.1.50 లక్షలు దాటితే ఆ విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిందే. మరోపక్క బీసీ, ఓసీలకు ఎంసెట్‌‌‌‌లో పది వేల ర్యాంకు దాకా మొత్తం ఫీజు సర్కారు చెల్లిస్తోంది. ఆ పైన ర్యాంకులు వచ్చి సీట్లు పొందే విద్యార్థులకు కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించనున్నది. పది వేల ర్యాంకు పైగా వచ్చి, సర్కారు కాలేజీల్లో సీట్లు పొందే విద్యార్థులు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ మంది ఉంటుండటంతో భారమంతా పేద బీసీ, ఓసీ విద్యార్థులపై పడనున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మూడు సార్లు ఫీజులు పెరిగాయి. కానీ పది వేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ను మాత్రం సర్కారు పెంచలేదు. 

పెరిగిన మొత్తం ప్రత్యేక ఖాతాల్లో 
టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ప్రకారం ఫీజుల వసూలుకు కాలేజీలు పర్మిషన్ పొందాయి. కానీ 2019–22 బ్లాక్ పీరియడ్‌‌‌‌లోని ఫీజులను మాత్రమే సర్కారు పరిగణనలోకి తీసుకుంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో గతంలో కంటే పెరిగిన ఫీజు మొత్తాన్ని స్టూడెంట్ల నుంచి వసూలు చేసినా.. వినియోగించుకునేందుకు కాలేజీలకు అవకాశం ఉండదు. అదనపు ఫీజులను మేనేజ్‌‌‌‌మెంట్లు ప్రత్యేక బ్యాంకు ఖాతాలో వేయాల్సి ఉంది. హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగానే ఈ అదనపు మొత్తంపై నిర్ణయం ఉంటుంది.

కొన్ని కాలేజీల్లో లక్షన్నర పైనే
ముందుగా హైకోర్టును ఆశ్రయించిన కాలేజీ మేనేజ్‌‌మెంట్లకు సానుకూలంగా తీర్పురావడంతో, అన్ని కాలేజీలు కోర్టు బాటపట్టాయి. సోమవారం నాటికి 81 కాలేజీలు హైకోర్టు నుంచి ఫీజుల పెంపునకు పర్మిషన్ పొందాయి. ఇవన్నీ దాదాపు గ్రేటర్ హైదరాబాద్​ చుట్టుపక్కల కాలేజీలే కావడం గమనార్హం. అత్యధికంగా సీబీఐటీలో రూ.1.73 లక్షల ఫీజు వసూలుకు అనుమతి పొందగా.. వాసవి, వర్ధమాన్, సీవీఆర్, బీవీఆర్ కాలేజీలు రూ.1.55 లక్షల ఫీజు వసూలు చేయనున్నాయి. శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్‌‌‌‌లో రూ.1.45 లక్షలు ఫీజు ఉంది. హైకోర్టుకు పోయిన వాటిలో 40 కాలేజీల్లో ఏటా రూ.లక్ష ఫీజు దాటింది. 

ఇయ్యాల సీట్ల కేటాయింపు
ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు మంగళవారం జరగనున్నది. మొత్తం74,292 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌లో పాల్గొన్నారు. వీరిలో మెజార్టీ స్టూడెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 13 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంది. సీటు అలాట్‌‌‌‌మెంట్ కాపీలోనే.. సర్కారు నిర్ణయం ప్రకారం ఫీజులు ఉంటాయనే విషయాన్ని పేర్కొంటామని అధికారులు చెప్తున్నారు.