Buchi Babu Trophy 2025: నేటి నుంచి బుచ్చిబాబు టోర్నమెంట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే

Buchi Babu Trophy 2025: నేటి నుంచి బుచ్చిబాబు టోర్నమెంట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే

ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా బుచ్చి బాబు టోర్నమెంట్ సోమవారం (ఆగస్టు 18) నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. భారత క్రికెట్ అగ్రగామి, దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీ నిర్వహిస్తారు. ఆరేళ్ల విరామం తర్వాత 2023లో ప్రారంభమైన ఈ టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్. ఆయుష్ మాత్రే లాంటి క్రికెటర్లు ఈ టోర్నీ కోసం బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీ షెడ్యూల్ ఏంటి..? పాల్గొనే జట్లు ఎన్ని..? లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలి..? వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

టైటిల్ రేసులో 16 జట్లు..

మొత్తం 16 జట్లు తలపడుతోన్న ఈ టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) నిర్వహిస్తోంది. పాల్గొంటున్న 16 జట్లను ఒక్కో గ్రూపుకు నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆగస్టు 18న గోజన్ కాలేజ్ ఎ గ్రౌండ్‌లో TNCA ప్రెసిడెంట్స్ XI HPCA మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలోని మూడు రౌండ్లు, సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు మొత్తం తొమ్మిది వేదికల్లో జరగనున్నాయి. గోజన్ కాలేజ్ ఎ గ్రౌండ్, గోజన్ కాలేజ్ బి గ్రౌండ్, గురునానక్ కళాశాల, MRF-పచియప్పలు, సీపీటీ ఐపీ, ఆమ్ జైన్ కాలేజ్, ఎస్.ఆర్.ఎమ్. కాలేజ్, మురుగప్ప గ్రౌండ్, ఐఐటీ మద్రాస్ గ్రౌండ్ మ్యాచ్ లు జరగనున్నాయి. 

బుచ్చి బాబు ట్రోఫీ 2025 గ్రూపులు

గ్రూప్ ఎ: TNCA ప్రెసిడెంట్స్ XI, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర

గ్రూప్ బి: రైల్వేస్, జమ్మూ అండ్ కాశ్మీర్, బరోడా, ఒడిశా

గ్రూప్ సి: TNCA XI, ముంబై, హర్యానా, బెంగాల్

గ్రూప్ డి: హైదరాబాద్, పంజాబ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్

ఇండియాలో బుచ్చి బాబు ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..? 

బుచ్చి బాబు ట్రోఫీ 2025 ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) యాప్ లో  ప్రసారమవుతుంది. యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. భారత కాలమాన ప్రకారం బుచ్చి బాబు ట్రోఫీ 2025 మ్యాచ్‌లన్నీ ఉదయం 9:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మూడు రోజులు జరుగుతాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు 90 ఓవర్లు.. రెండో  ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ఉంటాయి. సెమీ-ఫైనల్స్, ఫైనల్ లో నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి.