
క్యాసినో కేసులో వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. నాలుగున్నర గంటల పాటు బుచ్చిరెడ్డిని అధికారులు విచారించారు. మే, జూన్ నెలలో జరిగిన ఈవెంట్‌తో పాటు గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై బుచ్చిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. బుచ్చిరెడ్డికి సంబంధించిన ఆరు సంవత్సరాల బ్యాంకు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా అంశంపైనా అధికారులు ఆరా తీశారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరుకావాలని బుచ్చిరెడ్డికి ఈడీ సూచించింది. గుడివాడ, నేపాల్ లో జరిగిన క్యాసినో ఈవెంట్లలో అతడికి భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
షాపూర్‌లో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న బుచ్చిరెడ్డి.. తన బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులకు అందజేశాడు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోలో తనకు ఐదు శాతం వాటా ఉందని.. ఈ ఏడాది జనవరిలో అక్కడకు వెళ్లినట్లు అధికారులకు తెలియజేశాడని తెలుస్తోంది. అక్కడ డబ్బు గెలుచుకున్న లావాదేవీలన్నీ స్వదేశం నుంచే జరుగుతాయని బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, తలసాని మహేశ్, ధర్మేంద్ర యాదవ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.