ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు.. టాక్స్ ఫైలింగ్ కొత్త డెడ్ లైన్..

ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు.. టాక్స్ ఫైలింగ్ కొత్త డెడ్ లైన్..

కేంద్ర బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విప్లవాత్మక మార్పులను ప్రకటించారు. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో మరింత సరళంగా ఉండే ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025’ ఏప్రిల్ 1,2026 నుంచి అమలులోకి రానుంది. ఈ మార్పుతో పన్ను ఫారమ్‌లు మరింత సులభతరం కానున్నాయి. తద్వారా సామాన్యులు కూడా టాక్స్ నిపుణుల సాయం లేకుండానే రిటర్న్‌లు దాఖలు చేసే అవకాశం లభిస్తుంది.

కొత్త పన్ను విధానాన్ని(New Tax Regime) ఎంచుకునే వారికి ఆర్థిక మంత్రి భారీ ఊరటనిచ్చారు. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను ఉండదు. అంతేకాకుండా జీతగాళ్లకు ఇచ్చే ‘స్టాండర్డ్ డిడక్షన్’ను పెంచడం ద్వారా దాదాపు రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే వీలుంది. 

సాంకేతిక లోపాల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త చట్టంలో ‘డీ-క్రిమినలైజేషన్’కు ప్రాధాన్యం ఇచ్చింది. చిన్న చిన్న పన్ను నేరాలకు జైలు శిక్ష కాకుండా.. జరిమానా చెల్లించడం ద్వారా ఆ ప్రక్రియను ముగించేలా నిబంధనలను సడలించారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం చేసే ఖర్చులపై TCS రేటును 5 శాతానికి తగ్గించారు. ఇది విదేశీ పర్యటనలు చేసే వారికి పెద్ద ఊరట.

అలాగే పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి జూలై 31ని గడువుగా నిర్ణయించారు. గతంలో ఈ డెడ్ లైన్ డిసెంబర్ 31గా ఉండేది. దీనికి తోడు పన్ను చెల్లింపుదారులు చిన్న ఫీజు చెల్లించి మార్చి 31వరకూ రిటర్న్స్ రివైజ్ చేసుకోవచ్చని తప్పులను సరిదిద్దుకోవచ్చని చెప్పారు నిర్మలా సీతారామన్. అప్‌డేటెడ్ రిటర్న్‌లు దాఖలు చేయాలనుకుంటే ఆ సమయాన్ని 2 ఏళ్ల నుండి 4 ఏళ్లకు పెంచారు. అంతేకాకుండా ఇంటి అద్దెపై TDS మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులన్నీ పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయని ఆర్థిక మంత్రి ధీమా వ్యక్తం చేశారు.