వెంచర్​ రోడ్డు కోసం బఫర్​ జోన్ భూమి కబ్జా.. తూముకుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేత నిర్వాకం

వెంచర్​ రోడ్డు కోసం బఫర్​ జోన్ భూమి కబ్జా.. తూముకుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేత నిర్వాకం
  •     తూముకుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేత నిర్వాకం

శామీర్ పేట, వెలుగు: తన వెంచర్​కు రోడ్డు కోసం బీఆర్ఎస్​ తూముకుంట మున్సిపాలిటీ   బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఏకంగా బఫర్ జోన్ భూమినే కబ్జా చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూముకుంట మున్సిపాలిటీ పరిధి 7వ వార్డులో చెరువును ఆనుకుని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డికి చెందిన వెంచర్ ఉంది. చెరువు చుట్టుపక్కల భూమి బఫర్ ​జోన్ కిందకి రావడంతో దాని చుట్టుపక్కల కిలో మీటర్ వరకు ఎలాంటి నిర్మాణాలకు పర్మిషన్ ఉండదు. కానీ సదరు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తన వెంచర్​కు వెళ్లేందుకు  రోడ్డు కోసం బఫర్ జోన్ భూమిని కబ్జా చేశాడు.

ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా రోడ్డు వేయిస్తున్నాడు. గతంలో ఈ రోడ్డు కోసం మున్సిపల్ నిధుల నుంచి అధికారులు రూ.14 లక్షలు మంజూరు చేశారు. స్థానికులు కంప్లయింట్ చేయడంతో నిధులను నిలిపివేశారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి  సొంతంగా పైసలు ఖర్చుపెట్టుకుని రోడ్డును వేయిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ జైత్రంను వివరణ కోరగా.. ఎలాంటి పర్మిషన్ లేకుండా బఫర్ జోన్​లో నిర్మాణాలు చేపడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

క్వారీ గుంతల కబ్జా

జీడిమెట్ల: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై పేట్​బషీరాబాద్​ పోలీసులు కేసులు ఫైల్ చేశారు. కుత్బుల్లాపూర్ ​మండలం పేట్​బషీరాబాద్​పరిధిలోని సర్వే నం 25/1 ప్రభుత్వ భూమిలో ఉన్న క్వారీ గుంతలను కొందరు కబ్జాదారులు పూడ్చివేశారు. వాటిని జనాలకు అమ్మేందుకు ప్లాన్​ వేశారు. సంపంగి సురేశ్​అనే వ్యక్తి అనుచరులతో కలిసి కబ్జాకు యత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారులు పేట్​బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం  పోలీసులు కేసు ఫైల్ చేశారు.