మార్కెట్​ వాల్యూ పెంపు.. చిన్న బిల్డర్లకు పెద్ద దెబ్బే

మార్కెట్​ వాల్యూ పెంపు.. చిన్న బిల్డర్లకు పెద్ద దెబ్బే

హైదరాబాద్​, వెలుగు: రిజిస్ట్రేషన్​ ఛార్జీలు, మార్కెట్​ వాల్యూ పెంచిన ఆరు నెలల్లోనే మళ్లీ మార్కెట్​ వాల్యూను పెంచడం తమకు ఇబ్బందిగా మారిందని చిన్న బిల్డర్లు వాపోతున్నారు. కరోనా మహమ్మారి రాకతో ఓవైపు అమ్మకాలు లేక, మరోవైపు కన్​స్ట్రక్షన్​ ఖర్చు విపరీతంగా పెరగడంతో సమస్యలతో సతమతమవుతున్నామని వారు చెబుతున్నారు. మార్కెట్​ వాల్యూ పెంపుదలను కొంత కాలం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి చిన్న బిల్డర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టులు చేపట్టే పెద్ద కార్పొరేట్​ కంపెనీలను సంప్రదించి మార్కెట్​ వాల్యూ పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం రావడం సరయినది కాదని విమర్శిస్తున్నారు. 400 గజాల నుంచి 1000 గజాలలోపు చేపట్టే తమ ప్రాజెక్టులే ఎక్కువ మంది సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాయని, ఇలాంటి తమకు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు. 

రిజిస్ట్రేషన్​ ఛార్జీలు, మార్కెట్​ వాల్యూను 2021 జులైలో ఒకసారి పెంచారని, ఆరు నెలలలోపే ఈ నెల నుంచి మళ్లీ మార్కెట్​ వాల్యూ పెంచడం అన్యాయమని చిన్న బిల్డర్ల అసోసియేషన్​ తెలంగాణ బిల్డర్స్​ ఫెడరేషన్​ ఆరోపించింది. గ్రేటర్​ సిటీ బిల్డర్స్​, ఈస్ట్​జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​, కుకట్​పల్లి బిల్డర్స్​ అసోసియేషన్​, ఉప్పల్​ బిల్డర్స్​ అసోసియేషన్​,  ప్రగతి నగర్​ బిల్డర్స్​ అసోసియేషన్​, గ్రేటర్​ వెస్ట్​ సిటీ బిల్డర్స్​ అసోసియేషన్​, సౌత్​ జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్లు ఈ ఫెడరేషన్​లో భాగంగా ఉన్నాయి. ఫెడరేషన్​లో మొత్తం 900 మంది బిల్డర్లున్నారని, వారిలో చాలా మంది చురుగ్గా నిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ బిల్డర్స్​ ఫెడరేషన్​ ప్రెసిడెంట్​ సి ప్రభాకర రావు  మీడియాకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ రియల్​ ఎస్టేట్​ రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, లా అండ్​ ఆర్డర్​ మెరుగుపడటంతోపాటు, విద్యుత్​ కోతలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారూ హైదరాబాద్​లో నివాసం ఏర్పరుచుకునేందుకు ఇష్టపడుతున్నారని, ఇలాంటి నేపథ్యంలో అందుబాటు ధరలలో ఇండ్లు ఇవ్వగలిగే చిన్న బిల్డర్లను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు కస్టమర్లు ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని, తన ఆదాయం కోసం రిజిస్ట్రేషన్​, మార్కెట్​ వాల్యూలను ఏకపక్షంగా ప్రభుత్వం పెంచడం వల్లే ఇలా జరిగిందని అన్నారు.  

కన్వేయన్స్​ డీడ్స్​పై స్టాంప్​ డ్యూటీని జులై 2021లో 37.5 శాతం పెంచారని, దీంతో రిజిస్ట్రేషన్​ ఛార్జీలు 25 శాతం ఎక్కువయ్యాయి. అగ్రికల్చరల్​ ల్యాండ్స్​, ఇతర ప్రోపర్టీల మార్కెట్​ వాల్యూ 30 శాతం నుంచి 100 శాతం పెంచారు. నాలా ట్యాక్స్​ను జీహెచ్​ఎంసీ పరిధిలో 50 శాతం ఇతర ఏరియాలలో 67 శాతం పెంచారు. కన్​స్ట్రక్షన్​ రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, చిన్న బిల్డర్లే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాజా మార్కెట్​ వాల్యూ పెంపుదలతో  చిన్న బిల్డర్లు కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఫెడరేషన్​ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్​ జనరల్​ సెక్రటరీ టీ నరసింహా రావు, ట్రెజరర్​ బి గోపాల్​తోపాటు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.