పర్మిషన్‌‌‌‌ లేకున్నా.. రూల్స్‌‌‌‌ పాటించకున్నా..కూల్చుడే

పర్మిషన్‌‌‌‌ లేకున్నా.. రూల్స్‌‌‌‌ పాటించకున్నా..కూల్చుడే

మెదక్‌‌‌‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మున్సిపాలిటీల్లో నివాస భవనాలు, షాపింగ్​ కాంప్లెక్స్‌‌‌‌లు కట్టాలంటే ముందుగా మున్సిపల్‌‌‌‌ నుంచి పర్మిషన్​ తీసుకోవాలి. దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి. కొందరు అసలు పర్మిషన్లు తీసుకోకుండానే మల్టీఫ్లోర్ బిల్డింగ్‌‌‌‌లు కడుతుండగా, మరికొందరు తీసుకున్న పర్మిషన్ కంటే మించి అదనపు నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంకొందరు రోడ్డును ఆక్రమించి వరండాలు, మెట్లు నిర్మిస్తున్నారు. రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ పొలిటికల్‌‌‌‌ లీడర్ల ప్రెషర్‌‌‌‌‌‌‌‌తో మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. అయితే ఇటీవల వచ్చిన లోకల్‌‌‌‌ బాడీ అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రతిమా సింగ్‌‌‌‌ ఈ అక్రమ నిర్మాణాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించి కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్‌‌‌‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌లు నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అన్నది చెక్‌‌‌‌ చేస్తున్నారు. రూల్స్‌‌‌‌ పాటించకుండా నిర్మిస్తున్న ఎలాంటి బిల్డింగ్‌‌‌‌లైనా సరే నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు. కాగా పనులు జరిగేటప్పుడు పట్టించుకోకుండా లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చాలా వరకు జరిగిన తర్వాత కూల్చివేయడంపై ఆయా యజమానుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. 

జిల్లాలో పలు ఘటనలు..

జిల్లా కేంద్రమైన మెదక్‌‌‌‌లోని చేగుంట, నర్సాపూర్ క్రాస్ రోడ్డులో మెయిన్ రోడ్డును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్​ బిల్డింగ్‌‌‌‌లు నిబంధనలు అతిక్రమించినట్టు మున్సిపల్​ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్​ ప్రతిమా సింగ్ శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి దగ్గరుండి మరీ మూడు బిల్డింగ్‌‌‌‌ల వద్ద రూల్స్‌‌‌‌ పాటించకుండా కట్టిన బాగాలను జేసీబీల సాయంతో కూలగొట్టించారు. గత నెల 12న సైతం నిబంధనలు అతిక్రమించి నిర్మించిన రెండు బిల్డింగ్ నిర్మాణాలను అడిషనల్ కలెక్టర్​  కూల్చివేయించారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో మూడు బిల్డింగ్‌‌‌‌లు పర్మిషన్​ లేకుండా నిర్మిస్తున్నట్టు ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ టీం ఆఫీసర్లు గుర్తించారు. వారిచ్చిన రిపోర్ట్​ మేరకు అడిషనల్ కలెక్టర్​ పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న ఆయా బిల్డింగ్స్‌‌‌‌ను కూల్చివేయాలని ఆదేశించారు. ఈ మేరకు గత నెల 28న తహసీల్దార్​ శ్రీదేవి ఆధ్వర్యంలో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ టీం ఆఫీసర్లు తూప్రాన్​ పట్టణంలోని మెయిన్ రోడ్డులోని ఓ బిల్డింగ్​, సినిమా టాకీస్ ఎదురు కాలనీలో నిర్మిస్తున్న రెండు బిల్డింగ్‌‌‌‌లను కూల్చివేశారు. 

రూల్స్‌‌‌‌ ప్రకారమే నిర్మించాలి 

ఎవరైనా సరే మున్సిపల్ నుంచి తీసుకున్న అనుమతి ప్రకారమే బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలి. మున్సిపల్ అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ కొందరు పట్టించు కోకుండా రూల్స్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేస్తున్నారు. అందుకే కఠినంగా వ్యవహరిస్తున్నాం. మెదక్‌‌‌‌తో పాటు రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయిస్తాం. 
                                - ప్రతిమాసింగ్, అడిషనల్ కలెక్టర్, మెదక్