వికెట్ల వేటలో పేస్ కింగ్ ఎవరో.!

వికెట్ల వేటలో పేస్ కింగ్ ఎవరో.!

ఒకప్పుడు ఇండియా ప్రధాన బౌలింగ్‌‌ ఆయుధం స్పిన్‌‌. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లెజెండ్‌‌ కపిల్‌‌ దేవ్‌‌  తర్వాత ఆ స్థాయిలో మళ్లీ పేస్‌‌ బౌలింగ్‌‌తో విజయాలు అందుకునే స్థాయికి టీమిండియా వెళ్లింది. ఇదంతా కుర్ర పేసర్ల చలవే. అనుభవం పెద్దగా
లేకపోయినా.. అసాధారణ నైపుణ్యంతో మర్చిపోలేని అద్భుతాలు సృష్టించారు. ఆ అద్భుతాలు చేసిన వారిలో బుమ్రా, భువనేశ్వర్‌‌, షమీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఈ త్రయం కోట్లాది మంది అభిమానుల వరల్డ్‌‌కప్‌‌ ఆశలను మోస్తూ ఇంగ్లండ్‌‌ గడ్డపై వికెట్ల వేటకు సిద్ధమైంది. అక్కడ ఆడిన అనుభవం అంతగా లేకపోయినా.. రన్స్‌‌ నియంత్రించడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్‌‌ చేయడంలో బుమ్రా అండ్‌‌ కో  కు మంచి పేరుంది. స్వదేశంలో హిట్టైన ఈ పేస్‌‌ గ్యాంగ్‌‌.. పరుగుల వరద పారే ఇంగ్లిష్‌‌ పిచ్‌‌లపై టీమిండియాకు విజయాలు అందిస్తారా? మూడో వరల్డ్‌‌కప్‌‌ ముచ్చట తీరుస్తారా? అన్నది ఆసక్తికరం.

షమీ.. అవరోధాలు దాటి

జహీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ తర్వాత ఆ స్థాయిలో ప్రతిభ చూపెట్టిన బౌలర్‌‌‌‌ షమీ. కానీ గాయాలు, వ్యక్తిగత కారణాలతో 2015 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ తర్వాత అనూహ్యంగా జట్టులో చోటు కోల్పోయాడు. వ్యక్తిగత జీవితంలో అనేక వివాదాలు ఎదుర్కొన్న షమీ.. జాతీయ జట్టులోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు.  అరంగేట్రం చేసిన 2013 నుంచి 2015 మధ్యకాలంలో ఎంత ప్రభావం చూపాడో.. ఆ తర్వాతి కాలంలో అంతకంటే కిందకు దిగజారాడు. మోకాలి ఆపరేషన్‌‌‌‌ తర్వాత ఫామ్‌‌‌‌ కోల్పోయాడు. నాలుగేళ్లలో ఎన్నో అవమానాలు, అంతకంటే ఎక్కువ బాధలు అనుభవించినా.. మానసికంగా ఏనాడూ వెనకడుగు వేయలేదు.  పడి లేచిన కెరటంలా తీవ్రంగా శ్రమిస్తూ మళ్లీ టీమిండియా తలుపుతట్టాడు.  ఇటీవల జరిగిన ఆసీస్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై తన బౌలింగ్‌‌‌‌ ప్రతాపాన్ని చూపెడుతూ 14 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. టీమిండియా బౌలింగ్‌‌‌‌లో భువీ, బుమ్రా రెండు భిన్న ధ్రువాలైతే.. వాటికి స్థిరత్వం తెచ్చింది షమీయే. ఇప్పుడు ఈ ముగ్గురు లేకుండా ఇండియా పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ను ఊహించడం చాలా కష్టం. షమీ జట్టుకు దూరమైన తర్వాత టీమిండియా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎందరో బౌలర్లను పరీక్షించినా.. షమీ స్థాయిని అందుకున్న వారు లేరంటే అతిశయోక్తి కాదు. కచ్చితమైన లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌తో బంతులు వేయడం షమీకి వెన్నతో పెట్టిన విద్య. ఇంగ్లండ్‌‌‌‌లో ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఎదురైతే.. షమీని ఆపడం కష్టమే. తనలో సంప్రదాయబద్దంగా ఉన్న బలాన్ని కూడగడుతూ పాత బంతితో అద్భుతమైన రివర్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌ రాబడతాడు. ఈ లక్షణమే అతన్ని స్పెషల్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా నిలబెట్టింది. మానసికంగా చాలా బలవంతుడైన షమీ.. ఇంగ్లండ్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై కుదురుకుంటే ఇండియా కప్‌‌‌‌ కొట్టినట్లే!

భువనేశ్వర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌..

టీమిండియా పేస్‌‌ విభాగంలో అందరి కంటే సీనియర్‌‌ అయిన భువనేశ్వర్‌‌ కుమార్‌‌ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ఒకప్పుడు స్వింగ్‌‌కే పరిమితమైన అతను ఇప్పుడు భిన్నమైన బంతులలో చెలరేగుతున్నాడు.  బంతిని ఇరువైపులా స్వింగ్‌‌ చేయడం అతనిలో ఉన్న ప్రత్యేకత. ఆరంభంలోనే వికెట్లు తీస్తుండటం ఇండియాకు లాభించే అంశం. ఇక డెత్‌‌ ఓవర్లలో నకుల్‌‌ బాల్స్‌‌, యార్కర్లతో బ్యాట్స్‌‌మన్‌‌ను ఇబ్బందిపెట్టడంలో సిద్ధహస్తుడు. యాక్షన్‌‌లో ఏమాత్రం తేడా లేకుండా స్లో బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం భువీలో ఉన్న మరో లక్షణం. 2012లో వన్డే అరంగేట్రం చేసిన భువీ చాలా కాలం జట్టుకు ఫ్రంట్‌‌ లైన్‌‌ బౌలర్‌‌గా సేవలందిస్తూ కెప్టెన్‌‌ విరాట్‌‌, జట్టు సహచరులకు నమ్మకమైన బౌలర్‌‌గా మారాడు.. అయితే 2018లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు.  గాయం కారణంగా గతేడాది ఇంగ్లండ్‌‌ పర్యటన నుంచి తప్పుకున్న భువీ.. కొంతకాలం ఫిట్‌‌నెస్‌‌, ఫామ్‌‌ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఆస్ట్రేలియా టూర్‌‌లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.  ఐపీఎల్‌‌లోనూ ఆకట్టుకున్న భువీ ప్రస్తుతం మంచి టచ్‌‌లో ఉన్నాడు.  బౌలింగ్‌‌తో పాటు లోయర్‌‌ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌‌ చేయడం భువనేశ్వర్‌‌కు ఉన్న స్పెషల్‌‌ అడ్వాంటేజ్‌‌. ప్రధాన బ్యాట్స్‌‌మన్‌‌తో పోటీపడుతూ భారీ షాట్లు, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పే సత్తా అతని సొంతం. ఇక 2015 వరల్డ్‌‌కప్‌‌లో ఆడిన అనుభవం భువీకి ఇంగ్లండ్‌‌లో పనికొస్తే.. టీమిండియా పైచేయి సాధించినట్లే..!

బుమ్రా.. పేస్‌‌ దళపతి

జస్ప్రీత్‌‌ బుమ్రా.. వన్డే కెరీర్‌‌లో ఇప్పటిదాకా 49 మ్యాచులాడిన పేసర్‌‌ ఈ వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా పేస్‌‌ విభాగానికి దళపతి. డెత్‌‌ ఓవర్‌‌ స్పెషలిస్ట్‌‌గా పేరొందిన 25 ఏళ్ల బుమ్రా భిన్నమైన యాక్షన్‌‌తో కళ్లు చెదిరే యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌‌మన్‌‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఫార్మాట్‌‌ ఏదైనా..  టార్గెట్‌‌ ఎంతున్నా.. పిచ్‌‌ నుంచి సహకారం లేకపోయినా.. కొత్త, పాత బంతితో చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. షార్ట్‌‌ రన్నప్‌‌, స్లింగింగ్‌‌ యాక్షన్‌‌తో ప్రత్యర్థుల పాలిట క్లిష్టతరమైన బౌలర్‌‌గా పరిణమించాడు. 2016లో వన్డే జట్టులోకి వచ్చిన బుమ్రా.. చాలా వేగంగా అన్ని ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌‌గా ఎదిగాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే బంతులతో అటు విరాట్‌‌, ఇటు కోట్లాది మంది అభిమానుల మనసులను చూరగొన్నాడు. ప్రస్తుతం టీమిండియా అస్త్రాల్లో బుమ్రా అతి ప్రధానమైన ఆయుధం. మూడు ఫార్మాట్లలో కలిపి 185 వికెట్లు తీసిన బుమ్రా.. వన్డేల్లో 85 పడగొట్టాడు. వికెట్లు ఎంత నిలకడగా  తీస్తాడో పరుగులు ఇవ్వడంలో అంతకంటే ఎక్కువ పిసినారి బౌలర్‌‌. అందుకే వన్డేల్లో అతని ఎకానమీ 4.51గా ఉంది. అవసరమైతే షార్ట్‌‌ పిచ్‌‌లు, తప్పదనుకుంటే అద్భుతమైన బౌన్సర్లు కూడా సంధించగల మొనగాడు. బంతిని గాలిలో ఎక్కువసేపు స్వింగ్‌‌ చేస్తూ వేసే యార్కర్‌‌ అతని బౌలింగ్‌‌కు మచ్చుతునక. ఎక్కువగా బ్యాట్స్‌‌మన్‌‌ స్టాన్స్‌‌ బట్టి బంతులు వేస్తూ ఉచ్చులో పడేలా చేస్తాడు.