ఒంటరి మహిళలు ఉన్న ఇండ్లే ఆ దొంగల టార్గెట్

ఒంటరి మహిళలు ఉన్న ఇండ్లే ఆ దొంగల టార్గెట్

వరంగల్‍, వెలుగు: ఒంటరి మహిళలు ఉన్న ఇండ్లే ఆ దొంగల టార్గెట్.. మున్సిపల్​ఉద్యోగులమంటూ ఎంపిక చేసుకున్న ఇండ్లకు వెళతారు. ఇంటి కొలతల పేరుతో ఒకరు మహిళను మాటల్లో పెడతారు. అదే సమయంలో మరో ఇద్దరు ఇంటిలోకి వెళ్లి బీరువాలోని నగలు, నగదు దోచుకునేవారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీపీ డాక్టర్‍ తరుణ్‍జోషి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం దొడ్డేరికి చెందిన రామచంద్ర మల్లేశప్ప ట్రాక్టర్‍ డ్రైవర్‍. మున్సిపల్‍ ఉద్యోగుల పేరుతో దొంగతనాలు చేసే తమిళనాడుకు చెందిన వెంకటస్వామి గాంధీరాజ్‍తో కొన్నేళ్ల క్రితం మల్లేశప్పకు పరిచయం ఏర్పడింది. ఈజీ మనీ వస్తుండటంతో మల్లేశప్ప వారి ముఠాలో చేరాడు. 2018లో ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం కాకినాడలో నాలుగు చోరీలు చేశారు. దోచిన సొమ్మును సమాన వాటాలుగా పంచుకుని ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. అయితే తమిళనాడుకు చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్​చేసి జైలుకు పంపారు. దొంగతనాలతో సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన మల్లేశప్పకు సహచరులు పట్టుబడటంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో అతనే మరికొందరితో కలిసి కొత్త ముఠాను ఏర్పాటు చేశాడు.

కర్నాటకలో మొదట రెండు బైకులను దొంగిలించారు. చోరీ చేసే ప్రాంతానికి అనుగుణంగా బైక్ నంబర్‍ ప్లేట్లపై అక్కడి నంబర్లను రాయించేవాడు. తెలంగాణలో చోరీలు చేయాలని ప్లాన్‍ వేసి ఇక్కడకు ముఠా సభ్యులు చేరుకున్నారు. హనుమకొండ జిల్లా కేయూసీ పోలీస్‍ స్టేషన్‍ పరిధిలోని గోపాల్‍పూర్‍, సప్తగిరి కాలనీల్లో మున్సిపల్‍ ఉద్యోగుల పేరుతో ముగ్గురు సభ్యులు ఒంటరిగా ఉన్న మహిళల ఇండ్లకు వెళ్లారు. ఇంటి కొలతల పేరుతో ఒకరు వారిని మాటల్లో పెట్టగా మిగతా ఇద్దరు ఇంట్లోని బీరువాలో ఉన్న గోల్డ్, క్యాష్ దోచుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు వారి రాకపోకలపై నిఘా పెట్టారు. నిందితులు మహబూబ్‍నగర్‍ జిల్లాలో మూడు దొంగతనాలు, మహారాష్ట్రలోని కొల్పపూర్‍ ప్రాంతంలో మూడు చోరీలు చేశారు. కరీంనగర్‍, నిజామాబాద్‍ జిల్లాల్లో ఈ తరహా ఘటనలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. హనుమకొండకు బైక్‍పై వస్తున్న మల్లేశప్ప(37), తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన ఎండీ మురగన్‍ బాలకృష్ణ (29), దొడ్డేరికి చెందిన వెంకటేష్‍ తెప్పేశ్(23)లను కేయూ సీఐ దయాకర్‍, ఎస్సైలు సతీష్, సంపత్‍ అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.15.5 లక్షల విలువైన 320 గ్రాముల బంగారు నగలు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.