పోలీసు స్టేషన్ లాకర్‌లో చోరీ..ఇంటి దొంగలపనే

పోలీసు స్టేషన్ లాకర్‌లో చోరీ..ఇంటి దొంగలపనే
  • ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్

ఏలూరు: పోలీసు స్టేషన్లో దొంగతనం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి... కరుడు గట్టిన దొంగలు కూడా ఉలిక్కిపడతారు. అలాంటిది పోలీసు స్టేషన్లోని లాకర్ లో దాచిన రూ.8 లక్షల డబ్బు మాయం కావడం.. ఆ నోటా.. ఈ నోటా బయటకు పొక్కడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపింది. అయితే మిస్టరీని పోలీసులు నాలుగురోజుల్లోనే ఛేదించారు. ఊహించినట్లే ఇంటి దొంగల పనేనని గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లాకర్ లో దాచిన రూ.8 లక్షల నగదు మాయమైపోయిన ఉదంతం గత సోమవారం నాడు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సాక్షాత్తు పోలీసు స్టేషన్లో చోరీ జరగడమా..? అంటూ.. మీడియాలో ప్రముఖంగా కథనాలు రావడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి దీంతో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ కేసును సవాల్ గా తీసుకుని రంగలోకి దిగారు. అసాంఘిక వ్యక్తులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్న కానిస్టేబుళ్లు గంగాచలం, గేణేష్ లేనని తేల్చేశారు. గతవారం వరుసగా మూడు రోజులుగా బ్యాంకులు సెలవు కావడంతో మద్యం దుకాణాల ద్వారా చేసిన అమ్మకాల డబ్బును దుకాణా సిబ్బంది తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లాకర్లో భద్రపరిచిన విషయం తెలిసిందే. బ్యాంకులు తెరిచాక పోలీస్‌స్టేషన్‌లో తాము భద్రపరచిన డబ్బు కోసం వైన్ షాపుల సిబ్బంది రాగా... లాకర్ లో పెట్టిన నగదు కనిపించలేదు. దీంతో రెండు రోజులపాటు అంతర్గతంగా విచారించినా దొంగలెవరో తేలలేదు. డబ్బు తిరిగి రాలేదు. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్లోని డబ్బు మాయమైపోయిన ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ టెక్నాలజీని ఉపయోగించడంతోపాటు.. పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న అందరు కానిస్టేబుళ్ల వివరాలతో స్టడీ చేయించారు. అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్న గంగాచలం, గణేష్ లపై అనుమానం కలగడంతో వారిపై నిఘా ఉంచి తమదైన శైలిలో విచారించగా.. చోరీ చేసి ఎత్తుకెళ్లింది వీరేనని తేలింది. తొలుత నేరం ఒప్పుకునేందుకు నిరాకరించారు.. బుకాయించే ప్రయత్నం చేశారు. టెక్నాలజీ సహాయంతో వెలికితీసిన ఆధారాలు చూపించడంతో దొంగ పోలీసులు నీళ్లు నములుతూ నేరం ఒప్పుకోక తప్పలేదు. నిందితులను ఇద్దర్నీ అరెస్టు చేసి ఏలూరులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉద్యోగాల నుండి తొలగించే చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు.