
నస్పూర్, వెలుగు: మచ్చలేని నాయకుడు, నిజాయతీగల వ్యక్తి డాక్టర్ వివేక్ వెంకటస్వామిపై ఐటీ, ఈడీ దాడులను ఖండిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో వివేక్‌వెంకటస్వామికి లభిస్తున్న మద్దతు, ప్రజాదరణను చూసి తట్టుకోలేక అధికార పార్టీ లీడర్లు ఈ దాడులు చేయించారని ఆరోపించారు. ఎలాగైనా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
మంచిర్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్అభ్యర్థుల గెలుపు కోసం మాల మహానాడు కృషి చేస్తుందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దళితుల సాధికారత, అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, చిత్తశుద్ధితో అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌తోనే దళితులకు మరింత మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్దళితులను మధ్యలోనే వదిలేసిందన్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త పథకాన్ని తెరపైకి తెస్తూ వంచిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మాలలు కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోరారు. ప్రెస్మీట్లో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూపెల్లి మల్లయ్య, నాయకులు పొట్ట మధుకర్, దమ్మ నారాయణ, మినుముల శాంతికుమార్, బైరం రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.