
ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి జాతీయ రహదారిపై ఇవాళ( గురువారం) తెల్లవారు జామున జరిగింది. ఎల్లో ట్రావెల్స్‌కి చెందిన AR 02 A 8055 నెంబర్ బస్సు 32 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి సమీపంలోకి రాగానే బస్సు వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు ప్లాస్టిక్ వస్తువులు కాలిన వాసన రావడంతో అనుమానం వచ్చి డ్రైవర్‌కు చెప్పారు. అలర్టైన డ్రైవర్ బస్సును హైవే లో ఒక పక్కన ఆపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా కిందకు దిగారు. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, బస్సుతో పాటు అందులో ఉన్న సామగ్రి మొత్తం దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.