కారణం లేకుండ కాలిపోతున్నరు!

కారణం లేకుండ కాలిపోతున్నరు!

పెన్సిల్వేనియాలో డిసెంబర్ 5, 1966న డాక్టర్ జె. ఇర్వింగ్ బెంట్లీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. అప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేషన్‌‌ చేసినా ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే ఆయన శరీరం మొత్తం బూడిదైంది. ఒక కాలు, ఒక పాదం మాత్రమే మిగిలాయి. అదేంటి.. శరీరం మొత్తం కాలిపోయి కాలు మాత్రం ఎలా కాలిపోకుండా ఉంటాయంటారా? అదే ‘స్పాంటేనియస్‌‌ హ్యూమన్‌‌ కంబాషన్‌‌’ అంటే! ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటివరకు చాలామంది చనిపోయారు. అలా ఎందుకు జరుగుతుందనే దాని మీద ఇప్పటికీ రీసెర్చ్‌‌లు జరుగుతూనే ఉన్నాయి. 

డాక్టర్‌‌‌‌ బెంట్లీ తన బాత్రూమ్‌‌లోనే బూడిదయ్యాడు. ఒకవేళ ప్రమాదం జరిగి అతనికి మంటలు అంటుకున్నాయి అనుకుంటే.. ఇంట్లో ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా కాలిపోలేదు. ఒక మనిషికి నిప్పు అంటుకున్నప్పుడు తన చుట్టూ ఉన్న వస్తువులకు మంటలు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా నిప్పు తగలగానే పరుగెత్తే ప్రయత్నం చేసినప్పుడైనా వస్తువులకు నిప్పు అంటుతుంది. ఇక్కడ బాత్‌‌రూంలోని బాత్‌‌టబ్‌‌ మాత్రమే పొగవల్ల నల్లబడింది. మిగిలిన ఇల్లంతా చెక్కుచెదరకుండా ఉంది. బెంట్లీ ప్రమాదం వల్ల చనిపోయాడని మొదట వాదించినా తర్వాత దీన్ని స్పాంటేనియస్‌‌ హ్యూమన్‌‌ కంబాషన్‌‌గా గుర్తించారు సైంటిస్ట్‌‌లు. 

బెంట్లీకి సిగరెట్లు తాగే అలవాటుంది. దాంతో బాత్‌‌రూమ్‌‌లో సిగరెట్‌‌ కాలుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత శరీరం దానంతటదే కాలిపోయింది. ఇది నమ్మేలా లేకున్నా ఇదే నిజమని సైంటిస్ట్‌‌లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. దాదాపు అన్ని కేసుల్లో ఇంట్లో వస్తువులు కాలిపోకుండా కేవలం బాడీలు మాత్రమే బూడిదయ్యాయి. అయితే.. సడెన్‌‌గా మంటలు చెలరేగి మనుషులు చనిపోతారా? అంటే చాలామంది సైంటిస్ట్‌‌లు అది అసాధ్యమనే చెబుతున్నారు. కానీ.. ఇలాంటి కేసుల్లో మాత్రం సాధ్యమైంది. 

ఎస్‌‌హెచ్‌‌సీ అంటే? 
స్పాంటేనియస్‌‌ హ్యూమన్‌‌ కంబాషన్‌‌ (ఎస్‌‌హెచ్‌‌సీ) అంటే మనిషి బతికుండగానే నిప్పు తాకకుండానే శరీరం కాలి, బూడిదైపోతుంది. ఇలాంటి మొదటి కేసు 1641లో వచ్చింది. దీని గురించి మొదటగా చెప్పింది డెన్మార్క్​కు చెం​దిన థామస్ బార్తోలిన్ అనే అనాటమిస్ట్‌‌ (శరీర భాగాలపై రీసెర్చ్ చేసే సైంటిస్ట్‌‌). ఇలాంటి కేసులు అక్కడక్కడా నమోదవుతున్నా అవి అంతు చిక్కని మిస్టరీల్లానే ఉండేవి. ఎవరి ప్రమేయం లేకుండా మనుషులు కాలిపోతారనేదాన్ని ఎవరూ నమ్మలేదు. అందుకు తగిన ఆధారాలు కూడా లేవు. ఇలాంటి కేసులు 19వ శతాబ్దంలో చాలా ఎక్కువగా వచ్చాయి. 20వ, 21వ శతాబ్దాల్లో కూడా కొన్ని కేసులు రికార్డయ్యాయి. అంతెందుకు 2010లో చనిపోయిన 76 ఏళ్ల మైఖేల్ ఫాహెర్టీ అనే వ్యక్తి చావుకు కూడా ఎస్‌‌హెచ్‌‌సీ కారణమని తేలింది. ఇప్పటివరకు ఇలాంటివి కొన్ని వందల కేసులు నమోదయ్యాయి. కానీ.. కారణం ఇదీ అని నిరూపించలేకపోయారు.

అప్పుడే అందరికీ తెలిసింది
19వ శతాబ్దంలో ఫేమస్‌‌ రైటర్‌‌‌‌ చార్లెస్ డికెన్స్. ఆయన రాసిన “బ్లీక్ హౌస్‌‌”నవలలో ఒక పాత్ర స్పాంటేనియస్‌‌ హ్యూమన్‌‌ కంబాషన్‌‌ వల్ల చనిపోయినట్టు రాశాడు. ఈ నవల వల్లే దీని గురించి అందరికీ తెలిసింది. ఇలా మనుషులు చనిపోవడం అసాధ్యమని, డికెన్స్‌‌ కట్టుకథలు చెబుతున్నాడని అప్పట్లో చాలామంది మేధావులు వ్యతిరేకించారు. దాంతో ఆయన పోలీసు, ఫైర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్లు ఫైల్‌‌ చేసిన దాదాపు 30 కేసులను, వాటి తాలూకు రీసెర్చ్‌‌లను చూపించాడు. 

మందు తాగడమే కారణమా? 
ఎస్‌‌హెచ్‌‌సీ వల్ల చనిపోయిన వాళ్లలో అందరూ మందుతాగే వాళ్లే. వాళ్లలో చాలామంది రెగ్యులర్‌‌‌‌గా మందు తాగుతారు. ఎక్కువమంది ఓవర్‌‌‌‌ వెయిట్‌‌ ఉన్నారు. దీన్ని బట్టి వాళ్ల కడుపులో ఉన్న మందు వల్లే మంటలు చెలరేగి వాళ్లు చనిపోయారని చాలామంది వాదించారు. కానీ.. దీనికి సైంటిఫిక్‌‌ ఆధారాల్లేవు. కొందరేమో ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌ జరిగినప్పుడు వాళ్లు మందు మత్తులో ఉండి గుర్తించకపోవడం వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. కానీ.. అదే నిజమైతే కనీసం ఇంట్లో ఫర్నీచర్‌‌‌‌ అయినా కాలిపోవాలి కదా! మరో విషయం ఏంటంటే.. ఇలా చనిపోయిన వాళ్లలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ. 

మీథేన్‌‌ వల్ల
మనిషి బాడీ ఎక్కువగా నీళ్లతో నిండి ఉంటుంది. అందువల్ల బాడీలో మంటలు పుట్టే అవకాశం లేదు. కానీ.. బాడీలో ఉండే వాటిలో కొవ్వు, మీథేన్‌‌ గ్యాస్‌‌కి మాత్రమే మండే లక్షణం ఉంటుంది. వీటివల్లే పేగుల్లో మంటలు పుట్టి చనిపోయారని సైంటిస్ట్‌‌లు చెబుతున్నారు. కానీ.. అవి అందరి బాడీల్లో ఉంటాయి. వీటివల్ల మంట పుట్టే అవకాశమే లేదని మరికొందరన్నారు. సిగరెట్‌‌ తాగుతున్నప్పుడు, అగ్గిపుల్లతో మంట పుట్టించేటప్పుడు ప్రమాదం జరిగి వాళ్లు చనిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ.. అవి కూడా మంటల్లో కాలిపోవడం వల్ల ఆధారం లేకుండా పోయి ఉండొచ్చని  కొందరు అంటున్నారు. అయితే.. మనిషి శరీరం బూడిదగా మారాలంటే దాదాపు 3,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. కానీ.. బాడీలో అంత పెద్ద మంట పుట్టే అవకాశమే లేదంటున్నారు సైంటిస్ట్‌‌లు. అంతేకాదు మీథేన్‌‌ వల్ల పేగుల్లో పుట్టే  గట్ బ్యాక్టీరియా వల్ల చనిపోయారని, స్టాటిక్‌‌ ఎలక్ట్రిసిటీ దీనికి కారణమని, ఒబెసిటీ, ఒత్తిడి వల్ల అని, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంటలొచ్చాయని ఎవరికి తోచిన సిద్ధాంతాలు వాళ్లు చెప్పారు. వీటిలో  ఏ ఒక్కదాన్ని సైంటిఫిక్‌‌గా ప్రూవ్‌‌ చేయలేకపోయారు. 

అసిటోన్
2012లో బ్రిటిష్ బయాలజిస్ట్‌‌ బ్రియాన్ జే. ఫోర్డ్ చెప్పిన సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతున్నారు. ఆయన న్యూ సైంటిస్ట్ న్యూస్‌‌ పేపర్‌‌‌‌లో ఎస్‌‌హెచ్‌‌సీపై చేసిన రీసెర్చ్‌‌ గురించి రాశాడు. ఫోర్డ్ ప్రకారం... బాడీలో ‘అసిటోన్’ పేరుకుపోవడం వల్ల ఇలా మంటలు పుట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మందు ఎక్కువగా తాగేవాళ్లలో, డయాబెటిస్‌‌ ఉన్న వాళ్లలో లేదా ఒకే రకమైన ఫుడ్‌‌ తీసుకునే వాళ్లలో అసిటోన్‌‌ పేరుకుపోతుంది అని ఫోర్డ్​ రాశాడు. 

పైరోటాన్‌‌
బాడీ లోపల మంటకు కారణం పైరోటాన్‌‌ అని లారీ ఆర్నాల్డ్ అనే ఎక్స్​పర్ట్​ చెప్పాడు. అందుకు సంబంధించి అనేక రీసెర్చ్‌‌లు చేసినట్టు కూడా ఆయన చెప్పుకున్నాడు. పైరోటాన్ చిన్న-పేలుడును క్రియేట్‌‌ చేస్తుందని, దాని వల్ల మంట పుడుతుందని చెప్పాడు. కానీ.. ఈ కణమే కారణమని సైంటిఫిక్‌‌గా రుజువు చేయలేకపోయాడు. 

కానీ.. కాళ్లు అలానే
1998లో ఫోరెన్సిక్ సైంటిస్ట్‌‌ జాన్ డెహాన్ దీని రహస్యం తెలుసుకునేందుకు ఒక పందిపై ప్రయోగం చేశాడు. అతను ఒక దుప్పటిలో పంది శవాన్ని చుట్టి, దుప్పటిపై పెట్రోల్‌‌ పోసి మండించాడు. చూస్తుండగానే పంది బాడీలోని కొవ్వు కరిగి నిప్పుకు ఆజ్యం పోసినట్టైంది. కొన్ని గంటల తర్వాత మంటలను ఆర్పాడు. అప్పటికే పంది మాంసం, ఎముకల్లో ఎక్కువ శాతం బూడిదగా మారాయి. కానీ.. కాళ్లు మాత్రం కాలిపోలేదు. మనుషుల్లో కూడా చాలామందికి ఇలాగే జరిగింది. కాళ్లలో కొవ్వు తక్కువగా ఉండడం వల్లే కాలడం లేదని ఆయన చెప్పాడు. 

నోట్లో నుంచి మంట
ఇలాంటి కేసు 1600ల్లోనే రికార్డయినట్టు తెలుస్తున్నా.. 1400ల చివరలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగినట్టు చెప్పుకుంటున్నారు. పోలోనస్ వోర్స్‌‌టియస్ అనే ఇటలీ లేడీ ఒక నైట్‌‌ పార్టీలో మందుతాగింది. రెండు గరిటెల మందు తాగగానే ఆమె నోటిలో నుంచి మంటలు వచ్చాయి. ఆ వెంటనే బాడీ మొత్తం మంటలు చెలరేగాయని చెబుతుంటారు. అయితే.. ఆ పార్టీలో వైన్‌‌ తాగిన మరెవ్వరికీ  ఏ సమస్యా రాలేదు. 

కొన్ని కేసులు

  • 1951 జూలై 2న ఉదయం ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్‌‌బర్గ్‌‌లో 67 ఏళ్ల మేరీ రీజర్ అద్దె ఇంట్లో ఉండేది. ఒక రోజు ఆ ఇంటి యజమాని రీజర్‌‌ ఉంటున్న ఇంట్లో నుంచి మంటలు వస్తున్నట్లు గమనించింది.  ఇంట్లోకి వెళ్లి చూస్తే చెప్పులు వేసుకున్న రెండు కాళ్లు, కాలిపోయిన పుర్రె మాత్రమే  కనిపించాయి. 
  • 1967లో ఇంగ్లండ్‌‌లో  ఒక అపార్ట్‌‌మెంట్ కిటికీ నుంచి నీలి రంగు మంటలు వచ్చాయి. దాంతో చుట్టు పక్కల వాళ్లు ఫైర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఫోన్‌‌ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చేసరికి రాబర్ట్ ఫ్రాన్సిస్ బెయిలీ అనే వ్యక్తి కాలిపోయి ఉన్నాడు. చుట్టూ ఎక్కడా మంటల్లేవు. 
  • ఎస్‌‌హెచ్‌‌సీ బారిన పడ్డవాళ్లలో కొందరు బతికారు. అయితే.. వాళ్లకు నిప్పు తగలకుండానే, అగ్ని ప్రమాదం జరగకుండానే బాడీపై కాలిన గాయాలయ్యాయని చెబుతున్నారు. వాళ్లలో ఒకడు జాక్‌‌ ఏంజెల్‌‌. బాగా కాలిన గాయాలతో హాస్పిటల్‌‌లో చేరిన జాక్ ఏంజెల్.. ఒక వాటర్ హీటర్ కంపెనీపై కేసు పెట్టాడు. అది సరిగా పనిచేయకపోవడం వల్ల దాన్ని చెక్‌‌ చేస్తున్నప్పుడు అది ఊడిపోయి తనపై పడిందని అతను చెప్పాడు. దాని వల్ల అతని బాడీ కాలిందని ఆరోపించాడు. కానీ.. అతనికి ట్రీట్‌‌మెంట్‌‌ చేసిన డాక్టర్‌‌‌‌ మాత్రం అతని శరీరం లోపల నుంచి కాలిపోయిందని గుర్తించాడు. దాంతో అతను అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అతను నిద్రలో నుంచి లేచేసరికి కాలిన గాయాలున్నాయన్నాడు. 
  • ఒక తండ్రి, తన కూతురి(మెంటల్లీ ఏబుల్డ్‌‌ పర్సన్‌‌)తో ఒక ఇంట్లో ఉంటున్నాడు. ఒక రోజు బయటినుంచి వచ్చిన తండ్రి ఆమె కాలిపోవడం చూశాడు. అప్పుడు ఆమె నిశ్శబ్దంగా కుర్చీలో హాయిగా కూర్చుని ఉంది. ఆమెకు నొప్పి ఉన్నట్లే కనిపించలేదు ఆ తండ్రికి. తరువాత మంటలను ఆర్పి, హాస్పిటల్‌‌లో చేర్చాడు అతను. ప్రాణాలు మిగిలినా ఆమె కోమాలోకి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత చనిపోయింది. 
  • 1663లో పారిస్‌‌లోని ఒక మహిళ నిద్రలో ఉన్నప్పుడు బూడిదైంది. కానీ.. ఆమె పడుకున్న పరుపు కొంచెం కూడా కాలిపోలేదు. పైగా అది గడ్డితో తయారు చేసినది. 

::: కరుణాకర్​ మానెగాళ్ల