స్విగ్గీ బ్యాగ్తో బుర్ఖా మహిళ.. అసలు కథేంటంటే..

స్విగ్గీ బ్యాగ్తో బుర్ఖా మహిళ.. అసలు కథేంటంటే..

బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలినడకన 20 కిలోమీటర్ల ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారం చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ ఫొటోకు సంబంధించి అసలు నిజం ఇప్పుడు బయటపడింది. అసలు ఆమె స్విగ్గీ ఏజెంట్ కాదని, ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందని తేలింది. 

ఫొటోలో బుర్ఖా ధరించిన మహిళ పేరు రిజ్వానా. లక్నోలో నివాసం ఉంటోంది. ఇటీవల తన ఫొటో వైరల్ అయిందని తెలుసుకున్న ఆమె.. తన మాటల్లోనే తన కథ చెప్పింది. తాను  చెబుతూ.. ఉదయం, సాయంత్రం ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ.. రూ.1500 సంపాదిస్తున్నానని తెలిపింది. మధ్యాహ్నం మార్కెట్ లోని స్టాల్స్ లో డిస్పోజబుల్ గ్లాసెస్, దుస్తులను విక్రయిస్తాని, ఒక గ్లాస్ ప్యాకెట్ అమ్మితే తనకు రూ.2 వస్తాయని చెప్పింది. అలా నెలకు రూ. 5 నుంచి 6వేలు సంపాదిస్తానని రిజ్వానా చెప్పింది. నలుగురు పిల్లలున్న కుటుంబ పోషణకు ఆ మొత్తం ఏ మాత్రం సరిపోదని వాపోయింది. భర్త రిక్షా తొక్కేవాడని, ఒక రోజు ఎవరో దాన్ని దొంగిలించడంతో ఉన్న ఆధారాన్ని కోల్పోయామని చెప్పింది. ఓ రోజు భిక్షాటనకు వెళ్లిన తన భర్త.. మళ్లీ తిరిగి రాలేదని, ప్రస్తుతం ఒక గది అద్దెకు తీసుకొని ప్రస్తుతం అత్తమామలతో కలిసి జీవనం సాగిస్తున్నానని వివరించింది.

బ్యాగ్ వెనకాల దాగిన కథ...

డిస్పోజబుల్ గ్లాసెస్, కప్పులు పెట్టేందుకు బ్యాగ్ ఒకటి అవసరం ఉండటంతో దాలిగంజ్ వంతెన వద్ద ఒక వ్యక్తి నుంచి రూ.50 పెట్టి కొన్నానని స్విగ్గీ బ్యాగ్ వెనుక ఉన్న రహస్యం చెప్పింది. అప్పటి నుంచి తన వస్తువులను అందులో తీసుకెళతానని తెలిపింది. అందరూ స్విగ్గీ కోసం పనిచేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని, ఆ బ్యాగులో వస్తువులు పెట్టుకొని ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 25 కి.మీ.లు ప్రయాణిస్తానని చెప్పింది. ఫొటో వైరల్ కావడంతో ఒకతను వచ్చి తన బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకున్నాడని, ఆ తర్వాత కొంత మంది నుంచి ఆర్థిక సాయం కూడా అందిందని వెల్లడించింది.