పీజీఈసెట్ లో 91% క్వాలిఫై రిజల్ట్ రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం, లింబాద్రి

పీజీఈసెట్ లో 91% క్వాలిఫై రిజల్ట్ రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం, లింబాద్రి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పీజీఈసెట్ లో 91.28 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మంగళవారం జేఎన్టీయూహెచ్​లో పీజీఈసెట్ ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకూ ఆన్​లైన్​ లో19 రకాల కోర్సుల్లో అడ్మిషన్ల కోసం పీజీఈసెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 20,626 మంది అటెండ్ కాగా, వారిలో 18,829 మంది క్వాలిఫై అయ్యారు.

అత్యధికంగా ఫార్మసీ గ్రూపులో 7,127 మందికి 6891 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో 4423 మందికి గానూ 3965 మంది, సివిల్ ఇంజినీరింగ్ లో 2796 మందికి 2654 మంది, ఈసీఈలో 2294 మందికి 1898 మంది, ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ లో 1990 మందికి 1670 మంది క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం, లింబాద్రి మాట్లాడుతూ... పరీక్షలు పూర్తయిన ఐదు రోజుల్లోనే ఫలితాలు ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం 13,359 సీట్లుండగా..దీంట్లో ఎంటెక్ లో 8253 సీట్లు, ఎంఫార్మసీలో 4776 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ రెక్టర్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ర్టార్ వెంకటేశ్వర్లు, పీజీఈసెట్ కన్వీనర్ అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఫార్మసీలో కడప జిల్లాకు చెందిన బసవరాజు వెంకటప్రసాద్ టాపర్​గా నిలిచారు. సీఎస్​ అండ్ ఐటీలో హైదరాబాద్ కు చెందిన అంజనికుమార్, సివిల్ ఇంజినీరింగ్ లో రాజన్ బాబు టాపర్లుగా నిలిచారు.