వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా..

వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా..
  • నలుగురు మృతి.. మరో ఆరుగురికి గాయాలు
  • ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాళ్లపల్లి వద్ద ప్రమాదం
  • క్షతగాత్రులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలింపు
  • బాధితులంతా ఒడిశా రాష్ట్ర వలస కూలీలుగా గుర్తింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, బాధితులంతా ఒడిశా రాష్ట్ర వలస కూలీలుగా గుర్తించారు. 
నిన్న మధ్యాహ్నం ఒడిశా రాష్ట్రం నువాపడా జిల్లా శీనాపల్లి గ్రామం నుండి వలస కూలీలతో ఏపీలోని విజయవాడకు బయలుదేరింది సంగీత ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు.. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాళ్ళపల్లి వద్ద బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో బస్సు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలోఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
ఒకే కుటుంబానికి చెందిన తాత మనువరాలు మృతి
బస్సులో వెళ్తున్న వలస కూలీల్లో ఒకే కుటుంబానికి చెందిన తాత మనవరాళ్లు ఇద్దరూ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ మద్యం సేవించి నడపటం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తు్న్నారు.