తేడా వస్తే పైకే కదా : మొబైల్ లో వీడియోలు చూస్తూ.. హైవేపై బస్సు నడుపుతున్న డ్రైవర్

తేడా వస్తే పైకే కదా : మొబైల్ లో వీడియోలు చూస్తూ.. హైవేపై బస్సు నడుపుతున్న డ్రైవర్

అది బస్సు.. ప్రయాణికులతో పుల్ గా ఉంటుంది.. అలాంటి బస్సు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి.. తాను చేసిన తప్పుకు బస్సులోని 40 మంది ప్రాణాలకు ముప్పు ఉంటుంది.. అలాంటి బస్సు డ్రైవర్.. జాతీయ రహదారిపై.. 80 కిలోమీటర్ల వేగంతో వెళుతూ.. స్టీరింగ్ ముందు మొబైల్ పెట్టుకుని.. అందులో సినిమా చూస్తూ.. ఆడియోను ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ.. ఎంజాయ్ చేస్తూ బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు.. సగం చూపు రోడ్డుపై.. మరో సగం చూపు మొబైల్ లోని సినిమాపై.. ఇలాంటి షాకింగ్ ఘటన మన దేశంలోనే జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ బస్సు డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ బస్సు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో.. నెటిజన్లు బస్సు డ్రైవర్, బస్సు యాజమాన్య సంస్థ అజాగ్రత్తను విమర్శిస్తున్నారు. ప్రయాణీకుల ప్రాణాలకు, రహదారిపై ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా హాని కలిగించే ఈ వీడియోపై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియోలో బస్సు అతివేగంతో వెళుతుండగా, డ్రైవర్ చెవుల్లో హ్యాండ్స్‌ఫ్రీతో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తున్నాడు.

బస్సు నాగ్‌పూర్ నుండి పూణెకు వెళ్తుండగా, ఈ ఘటన జరిగింది. హైవేపై బస్సు అత్యంత వేగంతో కదులుతోంది. బస్సు డ్రైవర్ తన ఫోన్‌ను బస్సు స్టీరింగ్ వద్ద ఉంచి తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తున్నాడు. అతని ఫోన్‌లో వీడియోలు చూస్తూ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా చూడడం లేదన్నట్టుగా ఈ వైరల్ వీడియోలో కనిపించింది. డ్రైవర్ అలా తన ఫోన్‌లో వీడియో చూస్తుండగా,  బస్సు మొదటి లేన్ నుంచి మధ్య లేన్‌కు వచ్చినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంత ప్రమాదకరమైన విన్యాసం చేసి..డ్రైవర్ తనతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. సంగీత ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సును డ్రైవర్ నడుపుతున్నట్లు సమాచారం.

ఈ వైరల్ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బస్సు డ్రైవర్లపైనా, ఏజెన్సీపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ, బస్సులోని ప్రయాణీకుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ఒక ప్రయాణీకుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. బస్సు డ్రైవర్‌ను కూడా అప్రమత్తం చేశాడు, కాని డ్రైవర్ హెడ్‌ఫోన్స్ ధరించి ఉండటంతో వినలేదు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.