హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్ బి డివిజన్ ను విభజించవద్దని ఆ కాలనీ వాసులు నిరసనకు దిగారు. కాలనీ అస్తిత్వాన్ని కాపాడుతూ మూడు ముక్కలు చేయవద్దొంటూ కాలనీవాసులు అన్ని పార్టీల నాయకులు రోడ్డు నెంబర్ 1లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన చేపట్టారు. ఆసియాలోనే అతిపెద్ద డివిజన్ గా కేపీహెచ్ బి డివిజన్ పేరుగాంచిందన్నారు. 46 ఏళ్ల చరిత్ర కల్గిన ఈ డివిజన్ ను మూడు ముక్కలుగా చేయడం మంచిది కాదని డిమాండ్ చేశారు. కేపీహెచ్ బి రోడ్డు నెంబర్ ఒకటి నుంచి జేఎన్టీయూ వరకు, జేఎన్టీయూ నుండి ఫోర్త్ ఫేస్ వరకు కేపీహెచ్ బి డివిజన్ గా మార్చాలని కోరారు.
జేఎన్టీయూ నుంచి కలవరి టెంపుల్ వరకు కేపీహెచ్ బి డివిజన్ 2 గా మార్చాలన్నారు. ఇప్పుడు డివిజన్ పునర్విభజనలో భాగంగా బాలాజీ నగర్ వసంత నగర్ డివిజన్ల.. తమ డివిజన్లనో కలపడం విరమించుకోవాలని కోరారు. సమస్యలు వస్తే ఏ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు కాలనీ వాసులు.
జీహెచ్ఎంసీలో ఇటీవల శివారు మున్సిపాలిటీలు విలీనం కావడంతో వార్డులు, జోన్లు విభజన ప్రక్రియను వేగవంతం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన పలువురు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు డిసెంబర్ 19వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పింది.
గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది?
గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనబడుతోంది. వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించి ఫైనల్‌నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కార్పొరేషన్ ను రెండు చేయడమా లేక మూడు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కార్పొరేషన్ల బౌండరీలు ఫిక్స్ చేసి అధికారులు, సిబ్బందిని కేటాయించి ఎన్నికలకు వెళ్తారు. రెండు కార్పొరేషన్లు చేస్తే ఒక్కో కార్పొరేషన్లో 150 డివిజన్ల చొప్పున, మూడు అయితే, ఒక కార్పొరేషన్ కు వంద డివిజన్ల చొప్పున ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదంతా పూర్తవడానికి ఏడాది పడుతుందని, అప్పుడే ఎన్నికలకి వెళ్లనున్నట్టు తెలిసింది.
