తగ్గిన మూసీ వరద.. MGBS నుంచి బస్సుల రాకపోకలు రీస్టార్ట్..

తగ్గిన మూసీ వరద.. MGBS నుంచి బస్సుల రాకపోకలు రీస్టార్ట్..

హైదరాబాద్ ను మూసీ వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. శనివారం ( సెప్టెంబర్ 27 ) మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో  మూసీ పరివాహక ప్రాంతాలు సహా MGBS బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా నీట మునిగాయి. MGBS బస్ స్టాండ్ వరద నీరు వచ్చి  చేరడంతో రాకపోకలు నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం ( సెప్టెంబర్ 28 ) మూసీ వరద తగ్గుముఖం పట్టడంతో MGBS కు రాకపోకలు పునరుద్ధరించారు అధికారులు.

ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాకపోకలు యధావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు అధికారులు. శుక్రవారం అర్థ రాత్రి నుండి ఎంజీబీఎస్ లో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. మూసీ వరదలు భారీగా బస్టాండ్ లో కి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డా ప్రయాణికులు. 

బస్ స్టాండ్ ప్రాంగణంలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బురద క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని... యధా విధిగా ఆర్టీసి బస్సుల రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపారు అధికారులు.ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపి, కర్ణాటక రాష్ట్రలకు వెళ్ళే బస్సుల రాకపోకలు MGBS నుంచి యధావిధిగా కొనసాగనున్నాయి.

ఇదిలా ఉండగా.. చాలా ఏండ్ల తర్వాత జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​లకు ఊహించని రీతిలో ఇన్​ఫ్లో పెరిగింది. భారీ ఎత్తున వస్తున్న వరదను నిల్వచేసుకునే సామర్థ్యం లేకపోవడం, ఇప్పటికే ఫుల్​ట్యాంక్​లెవెల్​కు చేరుకున్న ఈ రెండు జలాశయాల్లోకి అదనంగా భారీ వరద చేరుకోవడంతో మెట్రోవాటర్​బోర్డు అధికారులు రెండు జలాశయాలకు సంబంధించి దాదాపు అన్ని గేట్లను ఎత్తారు. దీంతో మూసీకి వరద ఉధృతి పెరిగి సమీప ప్రాంత కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. 

గత 30 ఏండ్లలో ఇంత తీవ్రమైన ప్రవాహం చూడలేదని స్థానికులు అంటున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాలైన జన్వాడ, శంకర్​పల్లి, మొయినాబాద్, మోమిన్​పేట, మర్పల్లి తదితర ప్రాంతాలలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక్క వికారాబాద్​లోనే రెండు రోజుల్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ లో15 సెం.మీ.  థారూర్​లో 12.50 సెం.మీ., షాబాద్​ 11.83 సెం.మీ,బంట్వారం 11.25 సెం.మీ. . పూడూర్ లో - 11.13 సెం.మీ., నవాబుపేటలో 10.48 సెం.మీ., మోమిన్ పేటలో - 9.87సెం.మీ., బంట్వారం -7.76 సెం.మీ., మర్పల్లి - 7.46 సెం.మీ.,  కోటపల్లి - 6.68 ఎంఎం, , వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జంటజలాశయాలకు భారీగా వరద వచ్చి చేరింది. దీనిని మూసీలోకి  వదలడం వల్ల  ఉగ్రరూపం దాల్చింది.