పండుగ పాట్లు.. ఊరికి దారేదీ?

పండుగ పాట్లు..  ఊరికి దారేదీ?

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారికి ప్రయాణ కష్టాలు తప్పడంలేదు. బస్​స్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. సరిపడా బస్సులు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో బుకింగ్స్‌‌‌‌ ఫుల్‌‌‌‌ అయ్యాయి. రైళ్లలో జనరల్ బోగీల్లో కనీసం కాలు పెట్టేంత సందు కూడా ఉంటలేదు. ఇన్నిరోజులు బ్లాక్‌‌‌‌లో పెట్టిన సీట్లను ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లు ఓపెన్ చేస్తున్నారు. ఇక క్యాబ్స్‌‌‌‌, ఇతర ట్రావెల్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరిగింది. కొంత మంది సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.

వెయిటింగు.. వెయిటింగు..

సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి నుంచే చాలా మంది బయలుదేరారు. ఈసారి 4,940 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌‌‌‌ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోనే 3,414, ఏపీకి 1,526 బస్సులు తిప్పుతున్నారు. రెగ్యులర్ బస్సులకు అదనంగా10న 965, 11న 1,463, 12న 1,181, 13న 1,152 బస్సులను నడుపుతున్నారు. కానీ ఈ బస్సులు సరిపోవడం లేదు. ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.
చిన్న పిల్లలు, వృద్ధులతో వెళ్తున్న వారి కష్టాలు అన్నీఇన్నీ కావు.

టాయిలెట్ల దగ్గర కూర్చుని..

వివిధ ప్రాంతాలకు 480కిపైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని అధికారులు ప్రకటించినా.. అవి చాలడంలేదు. హైదరాబాద్‌‌‌‌లోని సికింద్రాబాద్‌‌‌‌, కాచిగూడ, నాంపల్లి తదితర స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీకి వెళ్లే ప్రయాణికుల ప్రయాస అంతాఇంతాకాదు. జనరల్‌‌‌‌ బోగీల్లో కనీసం కాలు పెట్టే సందు కూడా ఉండటంలేదు. టాయిలెట్ల దగ్గర కూడా కూర్చుని వెళ్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, ఖమ్మం, భద్రాచలం వైపు రూట్లలో పెద్ద సంఖ్యలో వెయిటింగ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ఉంటోంది. రద్దీ దృష్ట్యా ట్రైన్లకు అదనపు బోగీలు యాడ్‌‌‌‌ చేయాలని ప్యాసింజర్లు కోరుతున్నారు.

‘స్పెషల్‌‌‌‌’ చార్జీల మోత

రైల్వే, ఆర్టీసీ.. ప్రత్యేకం పేరుతో అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. 20 నుంచి 30 శాతం టికెట్ల ధరలు పెంచేశాయి. ఈ సీజన్​లో అదనంగా రూ.6 కోట్లకు పైగా ఆదాయం రావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌‌‌‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు సూపర్‌‌‌‌ లగ్జరీ బస్సు టికెట్‌‌‌‌ ధర రూ.372. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో రూ.558కి పెంచారు. ఇదే రూట్‌‌‌‌లో గరుడ బస్సులో సాధారణంగా రూ.620 ఉండగా, ఇప్పుడు 876కి పెరిగింది. ఇక ప్రత్యేక రైళ్లలో జనరల్‌‌‌‌ బోగీల్లో పెద్దగా రేట్లు పెంచలేదు. ఏసీ బోగీల్లోనే రూ.వంద నుంచి 500 దాకా పెంచారు. స్లీపర్‌‌‌‌ క్లాస్‌‌‌‌లలో టికెట్లు దొరక్కపోవడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీలో బుక్‌‌‌‌ చేసుకుంటున్నారు.

ఇదో రకం బాదుడు..

బస్సుల బోర్డింగ్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌లో అధికారులు మార్పులు చేశారు. ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ పేరుతో షెడ్యూల్డ్‌‌‌‌ బస్సులకు ఊరి చివర బోర్డింగ్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌ ఇచ్చారు. ఎంజీబీఎస్‌‌‌‌ నుంచి స్పెషల్‌‌‌‌ సర్వీసుల్ని మాత్రమే అందుబాటులో ఉంచారు. రెగ్యులర్‌‌‌‌ షెడ్యూల్డ్‌‌‌‌ బస్సుల్లో మాత్రం నిర్ణీత చార్జీ మాత్రమే వసూలు చేస్తారు. ఉదాహరణకు కోఠిలోని ప్రయాణికుడు కుటుంబ సమేతంగా కరీంనగర్‌‌‌‌ వెళ్లేందుకు బస్టాండ్​కు బయలుదేరాడు. షెడ్యూల్డ్‌‌‌‌ బస్సులో వెళ్లాలంటే జూబ్లీ బస్టాండ్‌‌‌‌కు వెళ్లాలి. జూబ్లీ బస్టాండ్‌‌‌‌ వరకు కుటుంబంతో కలిసి వెళ్లడం కొంచెం ఇబ్బంది కావడంతో ఎంజీబీఎస్‌‌‌‌లోనే స్పెషల్‌‌‌‌ బస్సులోనే వెళ్తాడు. ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ పేరుతో అనేక చోట్ల ఇలాగే బోర్డింగ్‌‌‌‌ పాయింట్లను ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

ట్రావెల్స్‌‌‌‌ బస్సుల్లో కృత్రిమ కొరత!

పండుగకు కొన్నిరోజుల ముందుగా కొందరు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో టికెట్లు బుక్‌‌‌‌ చేసుకున్నారు. ఇలా ఆర్టీసీ షెడ్యూల్‌‌‌‌ బస్సుల్లో రిజర్వేషన్‌‌‌‌ హౌస్‌‌‌‌ఫుల్‌‌‌‌ అయింది. అదే సమయంలో ప్రైవేటు ఆపరేటర్లు రంగంలోకి దిగారు. కృత్రిమ కొరత సృష్టించటానికి తమ ట్రావెల్స్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌కు సంబంధించిన వెబ్‌‌‌‌సైట్లను బ్లాక్‌‌‌‌లో పెట్టారు. తద్వారా కృత్రిమ కొరత సృష్టించారు. పండుగకు ముందు తెరిచి భారీ రేట్లకు టికెట్లు విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు టికెట్‌‌‌‌ రేట్‌‌‌‌ ఎంత అయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారు.