
గ్రేటర్ పరిధిలో కొత్త RTC బస్సులను యాజమాన్యం కొనడం లేదు. దాదాపు 13 ఏళ్లుగా ఉన్న బస్సులతోనే నడుపుతున్నారు అధికారులు. 2014 లో మెట్రో లగ్జరీ పేరుతో 80 వోల్వో ఏసీ బస్సులు తీసుకొచ్చారు. ఆ తర్వాత వాటిని రాజధాని బస్సులుగా మార్చి దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. 2007 నుంచి 2010 మధ్య 1300 JNURM పథకం కింద వచ్చిన మెట్రో ఎక్స్ ప్రెస్ , డీలక్స్ బస్సులు మినహా.... ఇప్పటివరకు ఒక్క కొత్త బస్సు ఏర్పాటు చేయలేదు.
లక్ష మంది జనాభాకి 60 బస్సులకు తగ్గకుండా ఉండాలని జాతీయ సేవా స్ధాయి ప్రమాణాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం 6 వేల బస్సులుండాలి. కానీ ప్రస్తుతం సిటీ పరిధిలో అందులో సగం బస్సులు కూడా లేవు. కేవలం 2,850 బస్సులతో ఆర్టీసీ నెట్టుకొస్తోంది. గతంలో 42 వేల ట్రిప్పులతో 33 లక్షల మందిని గమ్య స్ధానాలకు చేర్చిన ఆర్టీసీ ప్రస్తుతం 28 వేల ట్రిప్పులతో 22 లక్షల మందికే పరిమితమైంది.
2019 కి ఇప్పటికీ సిటీ జనాభాలో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ.. ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు , గ్రామాలు నగరం పరిధిలోకి వచ్చాయి. ఈనేపథ్యంలో సిటీలో ప్రజా రవాణా పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తోందని ఆర్టీసీ సంఘం నేతలు అంటున్నారు. ఇప్పటికే దీనిపై అనేకసార్లు ఆర్టీసీ మేనేజ్ మెంట్ కి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పాత డొక్కు బస్సులు నడపడం తమకు సవాల్ గా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు.
సంస్థ నష్టాల్లో ఉందనే సాకుతో ప్రయాణికులను ఇబ్బందిపాలు చేయటం సరికాదని యూనియన్ లీడర్లు వెల్లడిస్తున్నారు గ్రేటర్లో ఉన్న జనాభా లెక్క ప్రకారం 3,850 బస్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం 2,850 బస్సులే నడుపుతోంది.రెండేళ్ల క్రితం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తే బస్సుల కొరతతో ఇప్పుడు కేవలం 22 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.
సొంతవాహనాలు కొనలేని వారు, ఆర్టీసీని నమ్ముకున్న వారికి మాత్రం తిప్పలు పడుతున్నారు. కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లేవారు టైమ్ కి బస్సులు రావడం లేదని పేర్కొంటున్నారు. చేసేదేం లేక పాసులు ఉన్నా మెట్రో, లేదంటే ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాల్సి వస్తుందంటున్నారు. కనీసం పీక్ అవర్స్ లో నైనా సర్వీసులను పెంచితే కొంతవరకు ఇబ్బందులు తప్పుతాయంటున్నారు సిటీలో సర్వీసులను తగ్గించింది ఆర్టీసీ నష్టాలను పూడ్చడానికేనన్న టాక్ వినిపిస్తోంది. యాజమాన్యం నిర్ణయం ఎలా ఉన్నా బస్సుల్లేక, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రానున్న రోజుల్లో ఉన్న సర్వీసులను కూడా తగ్గిస్తే పరిస్థితి ఏంటని సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తోంది.