పండుగ రోజు కూడా తగ్గని రద్దీ.. ప్రయాణికులతో కిక్కిరిసిన MGBS, JBS బస్టాండ్లు

పండుగ రోజు కూడా తగ్గని రద్దీ.. ప్రయాణికులతో కిక్కిరిసిన MGBS, JBS బస్టాండ్లు

దసరా పండుగ సందర్భంగా గత వారం రోజులుగా బస్టాండ్లలో ప్రాణికుల రద్దీ కొనసాగుతూ ఉంది. పండగ రోజు కూడా ప్రయాణికులు సొంత ఊర్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ లోని ముఖ్యమైన బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. గురువారం (అక్టోబర్ 02) ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 

ఈసారి గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేరోజు (అక్టోబర్ 02)న రావడంతో ముందు రోజు వరకు ఉద్యోగాలు, పనులు చూసుకున్న నగర వాసులు.. పండుగ నాడు స్వగ్రామాలకు పయనమయ్యారు. దసరా వెలవులకు ఫ్యామిలీని ముందుగానే పంపించి.. పనులు చూసుకుని వెళ్తున్న వారు ఈ రెండు రోజులుగా ఊరిబాట పట్టారు. దీంతో బుధ వారంతో పాటు పండుగ రోజైన గురువారం కూడా బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.

హైదరాబాదులోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రజలతో బస్టాండ్లు రద్దీగా మారాయి. పండుగ రోజు ఇంటికి చేరుకునేందుకు ప్రజలు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రజల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఈరోజు (అక్టోబర్ 02) సాయంత్రం నుంచి వివిధ జిల్లాల నుండి తిరిగి హైదరాబాద్ బాట పట్టనున్నారు.  దీంతో ఇప్పటికే వివిధ జిల్లాలకు వెళ్లిన బస్సులను తిరిగి హైదరాబాద్ కు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.