ఉత్తర్​ప్రదేశ్ లో ఘోరం.. నదిలో ఆగిన బస్సు.. అందులో 25 మంది ప్రయాణికులు

ఉత్తర్​ప్రదేశ్ లో ఘోరం.. నదిలో ఆగిన బస్సు..  అందులో 25 మంది ప్రయాణికులు

నది ప్రవాహ తీవ్రతను గుర్తించలేని ఓ డ్రైవర్​ నిర్లక్ష్యం 25 మంది ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్​ నుంచి ప్రయాణికులతో హర్దివార్​బయల్దేరిన ఓ బస్సు కోటవాలి సీజనల్​ నది వద్దకు చేరుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదీ ప్రవాహం పెరిగింది. 

అది గమనించకుండా బస్సు డ్రైవర్​ నదిపై ఉన్న బ్రిడ్జీ నుంచి బస్సును పోనించాడు. అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో బస్సు కదలిక ఆగిపోయింది. ఇంజిన్​లోకి నీళ్లు వెళ్లి ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది.  నదిలో బస్సు ఉందన్న విషయాన్ని గుర్తించి స్థానికులకు పోలీసులు సమాచారం అందించారు. అప్పటికే ప్రాణ భయంతో కొందరు కిటికీలోంచి బస్సు టాప్​పై ఎక్కడానికి ప్రయత్నించగా.. మరి కొందరు నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయారు. క్రేన్​ సాయంతో బస్సు నదిలో కొట్టుకుపోకుండా చాలా సేపు ఆపారు. అనంతరం బస్సును నెమ్మదిగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఊహించని ఈ పరిణామంతో చాలా భయపడ్డామని ప్రయాణికులు వాపోయారు. జులై మొదటి వారంలో డెహ్రడూన్​లో ఓ బస్సు ఇలాగే వరదల్లో చిక్కుకుపోయింది. కిటికీల సాయంతో బయటికి వచ్చి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు.