సీసీటీవీలో రద్దీ చూసి బస్సులు పెంచుతం: తెలంగాణ ఆర్టీసీ

సీసీటీవీలో రద్దీ చూసి బస్సులు పెంచుతం: తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: సీసీ కెమెరాల ద్వారా బస్​స్టాప్ లలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. రష్​ఎక్కువుంటే స్పెషల్ బస్సులను వేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రధాన ట్రాఫిక్‌ పాయింట్లైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ లో కొత్తగా 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వాటిని బస్‌ భవన్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. అలాగే పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ లోని ఎక్కువ రద్దీ ఉండే బస్​స్టాపుల్లో ప్రయాణికులకు టెంట్లు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను వంటి సౌలత్​లు అందుబాటులోకి తేనుంది.

సంక్రాంతి బస్సులు ఉప్పల్​క్రాస్​రోడ్డు నుంచి

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి భువనగిరి, -యాదగిరిగుట్ట, మోత్కూర్‌/తొర్రూర్‌ వైపు వెళ్లే బస్సులను ఆపే స్థలాలను ఆర్టీసీ మార్చింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు ఇదివరకు స్థానంలోనే ఆపనున్నారు. యాదగిరిగుట్ట, తొర్రూర్‌ బస్టాప్‌లను లిటిల్‌ ప్లవర్‌ స్కూల్ సమీపంలోకి మార్చారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులన్నీ ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయని తెలిపారు.