యూపీలో విద్యారంగాన్ని నాశనం చేసిన్రు:అఖిలేష్ యాదవ్

యూపీలో విద్యారంగాన్ని నాశనం చేసిన్రు:అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన మొత్తం కుంభకోణాల మయంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ఆయుష్ కోర్సుల ప్రవేశాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమాలు జరుగుతున్నా యోగి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 2021లో జరిగిన నీట్ పరీక్షకు హాజరుకాకుండానే వందలాది మంది విద్యార్థులు ఆయుర్వేద, యునాని, హోమియోపతి కాలేజీల్లో జాయిన్ అయ్యారని తెలిపారు. 891 అడ్మిషన్లలో మోసం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. 

రాష్ట్రంలో ఆయుష్ కుంభకోణం ఒక్కటే కాదని..అనేక స్కాంలు తెరపైకి వస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిలేష్ యాదవ్  విమర్శించారు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేదుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అబద్దాల వ్యాపారం బట్టబయలు అవుతుందన్నారు. విద్యారంగాన్ని యోగి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. నిబంధనలు పాటించి అడ్మిషన్లు తీసుకున్న వారి చదువులకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా రన్ చేస్తున్న చాలా కాలేజీల గుర్తింపు రద్దు అయ్యిందని చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఎజెండాలో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపించారు.