టికెట్ల ధరలు ఇలా: మేడారం జాతరకు బస్సే బెటర్

టికెట్ల ధరలు ఇలా: మేడారం జాతరకు బస్సే బెటర్

నేరుగా గద్దెల చెంతకు చేరుకోవచ్చు.. జంపన్నవాగు కూడా దగ్గరే
ప్రైవేట్‌‌, సొంత‌‌ వెహికల్స్‌‌‌‌ లో పోతే 5 కిలోమీటర్లు నడవాల్సిందే
4వేలకు పైగా బస్సులు, స్టేట్​వైడ్​51 పికప్​సెంటర్ల ఏర్పాటు

మేడారం, వెలుగు:ట్రాఫిక్​లో చిక్కుకోకుండా వీఐపీలు, వీవీఐపీలు వెళ్లే మార్గంలో మేడారం జాతర వెళ్లాలనుందా? నాలుగైదు కిలోమీటర్లు నడిచే అవసరం లేకుండా గద్దెల చెంతకు చేరుకోవాలనుందా? అయితే హాయిగా ఆర్టీసీ బస్సులో వెళ్లండి. సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమీపంలోనే దిగవచ్చు. అక్కడికి జంపన్నవాగు కూడా దగ్గరే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీల వాహనాలు వెళ్లే రూట్​లోనే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తున్నారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా బస్సు ప్రయాణాన్ని ఎంకరేజ్‌‌ చేస్తోంది. మేడారం భక్తుల కోసం టీఎస్​ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నడిపిస్తోంది. భక్తులు ఎక్కడానికి వీలుగా 51 పికప్​ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రోజుకు 30 వేలకు పైగా  భక్తులను మేడారానికి చేరవేస్తోంది. జాతర ముగిసే సరికి 23 లక్షల మంది భక్తులను బస్సులలో తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రయాణికులకు సేవలందించడానికి 12 వేల మందికి పైగా సిబ్బందిని నియమించింది.

 ప్రైవేట్ ​వెహికల్స్​తో కష్టాలే…

బుధవారం సారలమ్మ గద్దెకు చేరనుండడంతో మేడారం మహాజాతర  ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకోవడానికి సాధారణ భక్తులు గంటల కొద్దీ వేచి చూడక తప్పదు.  దీంతో వీఐపీ, వీవీఐపీ దర్శనం టికెట్లు, వెహికల్‌‌ పాస్‌ల‌ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల పాస్‌‌ల కోసం ఆరాటపడుతున్నారు. తమకు తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు తదితరులతో పాస్‌‌ల కోసం పైరవీలు చేయించుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే..  సాధారణ భక్తులు ప్రయాణించే ప్రైవేట్‌‌, సొంత వాహనాలను పస్రా, చిన్నబోయినపల్లి, కాటారం నుంచి పంపిస్తారు. ఈ  వాహనాలన్నింటినీ గద్దెలకు చాలా దూరంలో ఏర్పాటు చేసిన పార్కింగ్​ ప్లేస్​లలో నిలపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అమ్మల దర్శనం కోసం కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులను మాత్రమే వాటి ద్వారా చేరవేస్తారు. ఇంతా చేస్తే తిరిగి వెళ్లేటప్పుడు నార్లాపూర్‌‌, కమలాపూర్‌‌ క్రాస్‌‌‌ మీదుగా వెళ్లాలి. అంటే సుమారు 50 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిందే. అదే వీఐపీ, వీవీఐపీ వెహిక‌ల్స్​ మాత్రం తాడ్వాయి మీదుగా గద్దెలకు అతి సమీపంలోకి అనుమతిస్తారు. ఈ రూట్‌‌లోనే ఆర్టీసీ బస్సులకు కూడా ప్రభుత్వం అనుమతిస్తోంది. అందువల్ల ఆర్టీసీ ప్రయాణికులు ఎలాంటి శ్రమ లేకుండా నేరుగా గద్దెల సమీపానికి చేరుకోవచ్చు.

జాతరకు 4 వేల బస్సులు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల బస్సులను తిప్పుతోంది.  2018 జాతరలో 3,500 బస్సులను ఏర్పాటు చేసి 17 లక్షల మంది ప్రయాణికులను చేరవేయగా… ఈసారి మరో 500 బస్సులను పెంచి 23 లక్షల మంది భక్తులను మేడారం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్‌‌ రీజియన్ల పరిధిలో 51 సెంటర్లను ఏర్పాటు చేసి భక్తులను మేడారం తీసుకెళ్తున్నారు. జాతర కోసం ఆర్టీసీ 12,500 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో 8,500 డ్రైవర్లు, 3 వేల మంది కండక్టర్లు కాగా మిగతా వారంతా మెకానిక్‌‌లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్‌‌వైజర్లు, డిపో మేనేజర్లు ఉన్నారు. మేడారంలోనే తాత్కాలిక బస్‌‌ స్టేషన్‌‌ ఏర్పాటు చేసి సిబ్బందికి భోజనాలు అందిస్తున్నారు. అలాగే వారి కోసం విశ్రాంతి గదులు కూడా ఏర్పాటుచేశారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌‌ స్తంభించకుండా 15 మొబైల్‌‌ టీమ్ లను కూడా నియమించారు. ఈసారి జాతరకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 25 బస్సులను మేడారానికి నడుపుతోంది. ఆ రాష్ట్రంలోని  సిరోంచ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ సర్వీసులను అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి కట్టడం వల్ల ఆ రాష్ట్రం నుంచి బస్సులు నడిపించడానికి వీలవుతోంది.