అభ్యర్థులు ఫైనల్‌.. సమరానికి సై

అభ్యర్థులు ఫైనల్‌..  సమరానికి సై
  • జూబ్లీహిల్స్​ బరిలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి 
  • ఓసీ క్యాండిడేట్లు.. కాంగ్రెస్​ నుంచి బీసీ అభ్యర్థి
  • గెలుపుపై ఎవరి అంచనాలు వారివే
  • బీసీలు, మైనారిటీలు తమవైపే అంటున్న కాంగ్రెస్​
  • సిటీలో డెవలప్‌మెంట్​ వర్క్స్, స్కీమ్స్‌ కలిసివస్తాయని ధీమా
  • సెంటిమెంట్‌నే నమ్ముకున్న బీఆర్‌‌ఎస్​.. మోదీ చరిష్మా, హిందుత్వపై బీజేపీ ఆశలు

హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్ అసెంబ్లీ  స్థానంలో ఉపఎన్నిక వేడి రాజుకున్నది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్‌ చేయడంతో.. గురువారం నుంచి ప్రచారం హోరెత్తనున్నది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో, భిన్నమైన వ్యూహాలతో ముందుకుపోతున్నాయి. 

బీసీలు, మైనారిటీల మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసివస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా.. సెంటిమెంట్ తమకు కలిసివస్తుందేమోనని బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ.. ఎప్పట్లాగే మోదీ చరిష్మా, హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తున్నది. కాంగ్రెస్​ నుంచి స్థానిక లీడర్,  నవీన్‌ యాదవ్​, బీఆర్‌‌ఎస్​ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్​ భార్య సునీత, బీజేపీ నుంచి దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో సునీత, దీపక్​రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతలు కాగా.. నవీన్ ​యాదవ్​ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీల ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నది. 

ఈ నేపథ్యంలో వీరే తమ విజయానికి పునాది అని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నది. యువకుడు, బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వడం ద్వారా ఈ వర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనే స్పష్టమైన సందేశాన్ని అధికార పార్టీ పంపింది. గతంలో హైదరాబాద్​ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్​ గెలవలేదు. దీంతో ఈ బై ఎలక్షన్‌‌‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.  ముఖ్యంగా ముస్లిం మైనారిటీల సంఖ్య గణనీయంగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలో లక్ష ఓటర్లకు పైగా మైనార్టీలే ఉన్నట్లు తెలుస్తున్నది. 

అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఉద్దేశించిన పథకాలు, వారికిస్తున్న ప్రాధాన్యత కారణంగా మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నది. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ, తాము అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, ఈ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు  కాంగ్రెస్​నేతలు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు.  జూబ్లీహిల్స్ సహా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. 

అటు పార్టీ చేపట్టిన సర్వేల్లోనూ కాంగ్రెస్‌‌‌‌పై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తున్నది.  ముఖ్యంగా నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై చూపుతున్న శ్రద్ధ నగరవాసులను ఆకట్టుకుంటాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపులాంటి తక్షణ ప్రయోజనాలు అందించే పథకాలు మధ్య,  దిగువ మధ్య తరగతి ఓటర్లలో తమ పట్ల సానుకూలతను పెంచాయని కాంగ్రెస్ అంచనా వేస్తున్నది.  

సెంటిమెంట్‌‌‌‌ అస్త్రంగా  బీఆర్ఎస్..

సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఈ ఉపఎన్నికలో సెంటిమెంట్‌‌‌‌ను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నది. మాగంటి గోపీనాథ్​ భార్యకు టికెట్ కేటాయించడం ద్వారా..సానుభూతిని ఓట్లుగా మలుచుకోవాలని పార్టీ వ్యూహరచన చేసింది. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ ఒక్క సీటు గెలిస్తే, ఎంఐఎం కంచుకోట మినహా మిగిలిన 16  స్థానాలు బీఆర్ఎస్​ గెలుచుకున్నది. దీంతో ఇప్పుడు కూడా తామే గెలుస్తామనే ధీమాతో ముందుకు వెళ్తున్నది.  

గతంలో నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్​ చేసిన సేవలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారంలో ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక అభివృద్ధి కుంటుపడిందని, తమ పాత నాయకత్వం మాత్రమే నియోజకవర్గాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురాగలదని  ఓటర్లను కలిసి వివరిస్తున్నది.  

ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిట్టింగ్​ ఎమ్మెల్యేల ఆకస్మిక మృతితో వచ్చిన ఏ బై ఎలక్షన్స్‌‌‌‌లోనూ బీఆర్ఎస్​ గెలవకపోవడం ఆ పార్టీని కలవరపెడుతున్నది.  

జాతీయ నాయకత్వంతోప్రచారం చేసేందుకు బీజేపీ ప్లాన్..

ఇక బీజేపీ..  ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ  చరిష్మా, కేంద్రం  చేపట్టిన  అభివృద్ధి

కార్యక్రమాలపైనే ఆశలు పెట్టుకున్నది.  2023లో బీజేపీ అభ్యర్థి దీపక్‌‌‌‌రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి.. మూడో స్థానంలో నిలిచారు. పార్టీ మళ్లీ ఆయనకే టికెట్‌‌‌‌ను కేటాయించింది. దీంతో ఆయనకు సానుభూతి కాస్తయినా పనిచేస్తుందని భావిస్తున్నది. గతంలో అంబర్‌‌‌‌‌‌‌‌పేట్, ముషీరాబాద్, గోషామహల్​ స్థానాల్లో బీజేపీకి పట్టు ఉండేది. ఇవి గెలిచే స్థానాలుగా ఉండేవి.  

కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం గోషామహల్​ నుంచి బీజేపీ తరఫున రాజాసింగ్ మాత్రమే గెలిచారు. దీంతో సిటీలో బీజేపీ ప్రభావం తగ్గిందనే చర్చ జరిగింది. కానీ పార్లమెంట్​ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలతోపాటు విస్తరించి ఉన్న  సికింద్రాబాద్, మల్కాజ్‌‌‌‌గిరి, చేవేళ్ల.. ఇలా 3 ఎంపీలు గెలిచింది. 

దీంతో జాతీయస్థాయిలో మోదీ నాయకత్వానికి ఉన్న ఆదరణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయ భద్రతలాంటి అంశాలను ఇప్పుడు జూబ్లీహిల్స్​ బై ఎలక్షన్స్  ప్రచారంలో హైలైట్ చేస్తున్నది. స్థానికంగా యువ, శక్తివంతమైన నాయకుడిని రంగంలోకి దించడం ద్వారా నగరంలోని చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. 

జాతీయ నాయకత్వం నుంచి స్టార్ క్యాంపెయినర్లను రప్పించి, ప్రచారాన్ని హోరెత్తించడం ద్వారా జూబ్లీహిల్స్‌‌‌‌లో విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది.