అభ్యర్థి విషయంలో నోరు జారొద్దని కేసీఆర్ నిర్దేశం

అభ్యర్థి విషయంలో నోరు జారొద్దని కేసీఆర్ నిర్దేశం

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్‌‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు సూచించారు. మునుగోడు బైపోల్ నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. తర్వాత జరిగిన రాష్ట్ర కేబినెట్‌ మీటింగ్‌లోనూ మునుగోడు బై ఎలక్షన్‌పై చాలా సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. నియోజకవర్గ వివరాలతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ నెల 21న బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు ఒక రోజు ముందుగా నిర్వహించే సభను విజయవంతం చేసి పార్టీ కేడర్‌‌లో జోష్ నింపాలని, టీఆర్ఎస్ సత్తా చాటాలని నేతలకు సీఎం సూచించారు.

అసంతృప్తులకు బుజ్జగింపులు

అసంతృప్త నేతలకు తగిన పదవులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థి విషయంలో ఎవరూ నోరు జారొద్దని, ప్రకటన గురించి పార్టీ చూసుకుంటుందని, కేడర్‌‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. నల్గొండ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలకు.. మునుగోడు మండలాలు, మున్సిపాలిటీల బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఈ ఇన్‌చార్జ్‌లు బహిరంగ సభ వరకే పనిచేస్తారని, ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరన్నది డిసైడయ్యాక పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మునుగోడు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చండూరు మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు నియోజకవర్గంలో పర్యటించే నేతలకు, వేరే జిల్లాల నుంచి వచ్చే లీడర్లకు బస ఏర్పాటు చేసేందుకు ప్రధాన లాడ్జీలన్నీ బుక్ చేశారు.