
మార్కెట్లో మిర్చి ధరలు చూస్తే రైతు కంట కన్నీరే వస్తుంది. . .అన్నదాతలో ఆనందం లేకుండా పోయింది. క్వింటాల్ మిర్చి ఏకంగా 10 నుంచి 15 వేల కు పడిపోవడంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కర్నాటక బ్యాడగి ఏపీఎంపీ మండిలో రైతులు ఆందోళన చేశారు. మూడు ఏపీఎంసీ వాహనాలకు రైతులు నిప్పు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే
కర్ణాటకలోని హవేరి మార్కెట్‌లో రైతులు బీభత్సం సృష్టించారు. కర్నాటకలోని బ్యాడగి ఏపీఎంసీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మిర్చి ధర పడిపోవడంతో ఈ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాడగి మిర్చి మార్కెట్లో ఈసారి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ సోమవారం( మార్చి 11) రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ అధికారులకు... రైతులకు మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఏపీఎంసీ వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అన్నదాతలు కడుపు మంటతో పోలీసులపై రాళ్లు రువ్వారు.
కర్నాటక బ్యాడగి ఏపీఎంసీ మార్కెట్ జరిగిన గొడవపై బైడగి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ నీలప్ప శివన్నవర్ స్పందించారు. గత వారం మిర్చి క్వింటాకు రూ. 20 నుంచి 25 వేలు పలకగా.. ఈ వారం రూ. 10 నుంచి 15 వేలకు పడిపోయింది. ఈ మార్కెట్ కు మిర్చిని విక్రయించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మిర్చి అమ్మేందుకు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు.
మార్కెట్‌లోనే రైతులు వాహనాలకు నిప్పు పెట్టారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మార్కెట్ కార్యాలయంలోని కంప్యూటర్ పగిలిపోయింది. ఏపీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అద్దాల కిటికీలకు రాళ్లు విసరడంతో భారీ నష్టం వాటిల్లింది. ఒక్క వారంలోనే మిర్చి ధర క్వింటాల్‌కు రూ.10 నుంచి -15 వేలకు పడిపోయిందని రైతులు వాపోయారు. దీంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పంటకు సరైన ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.గత వారం వచ్చిన మిర్చి ధరకే మళ్లీ కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు