అసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్​.. బీజేపీకి 3, ఇండియా కూటమికి 4

అసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్​.. బీజేపీకి 3, ఇండియా కూటమికి 4

లక్నో/అగర్తలా: ఈ నెల 5న ఆరు రాష్ట్రాలలో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పార్టీలు (కాంగ్రెస్, జేఎంఎం, టీఎంసీ, ఎస్పీ)  నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్, ఉత్తరప్రదేశ్ లోని ఘోసీ, కేరళలోని పుత్తుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పుర్, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, ఝార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్​ జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్‌పై 2,400 ఓట్లకుపైగా ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి పార్వతిదాస్ విజయం సాధించారు. 

త్రిపురలో రెండు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. బాక్సానగర్ లో తఫజ్జల్ హొస్సేన్, ధన్‌పుర్ లో బిందు దేవ్‌నాథ్ గెలిచారు. 66 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్న బోక్సానగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ 30,237 ఓట్లతో విజయం సాధించారు. హొస్సేన్కు 34,146 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం)కు చెందిన మిజాన్‌ హొస్సేన్‌కు 3,909 ఓట్లు వచ్చాయి. ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ధన్‌పూర్‌లో కూడా బీజేపీ 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచింది. దేబ్‌నాథ్‌కు 30,017 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కౌశిక్ చందాకు 11,146 ఓట్లు వచ్చాయి. కేరళలోని పుత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్.. అధికార ఎల్‌ఢీఎఫ్ అభ్యర్థి జైక్ సీ థామస్‌పై విజయం సాధించారు. 

ఊమెన్‌కు 80,144 ఓట్లు రాగా, థామస్‌కు 42,425 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లిజిన్ లాల్ 6,558 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురిలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన తాపసి రాయ్ పై 4,313 ఓట్లతో గెలుపొందారు. చంద్ర రాయ్ కి 96,961 ఓట్లు రాగా, తాపసి రాయ్ 92,648 ఓట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఘోసీలో  సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్, బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై గెలుపొందారు. జార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన బేబీ దేవి.. ఏజేఎస్​యూకి చెందిన యశోదా దేవిని 17వేల ఓట్లతో ఓడించారు.  బేబీ దేవికి 1,35,480 ఓట్లు రాగా, యశోదా దేవికి 1,18,380 ఓట్లు వచ్చాయి.