కొబ్బరి మద్దతు ధర రూ. 12 వేలు

కొబ్బరి మద్దతు ధర రూ. 12 వేలు

న్యూఢిల్లీ: కొబ్బరి రైతులను ప్రోత్సహించేందుకు గాను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను రూ. 250 నుంచి రూ. 300 వరకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 సీజన్ కు గాను ఫెయిర్, యావరేజ్ క్వాలిటీ కొబ్బరి చిప్పలకు క్వింటాల్ పై రూ. 250, మిల్లింగ్ క్వాలిటీ కొబ్బరి చిప్పలకు క్వింటాల్ పై రూ. 300 ఎంఎస్పీని పెంచేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేబినెట్ మీటింగ్ తర్వాత కమిటీ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ‘‘అంతర్జాతీయంగా కొబ్బరి ధరలు పడిపోయాయి. అయినా, కొబ్బరి రైతుల ప్రయోజనం కోసం మోదీ సర్కారు మద్దతు ధరను పెంచింది. తాజా పెంపుతో వచ్చే సీజన్ లో యావరేజ్ కొబ్బరి ఎంఎస్పీ ధర క్వింటాల్ కు రూ. 11,600కు, మిల్లింగ్ కొబ్బరి ఎంఎస్పీ ధర క్వింటాల్ కు రూ. 12 వేలకు పెరగనుంది” అని ఆయన తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధరను కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు. కొబ్బరి ఎంఎస్పీ 2014‌‌‌‌‌‌‌‌–15లో రూ. 5,250, రూ. 5,500 ఉండగా.. పదేండ్లలో మోదీ సర్కారు రూ. 5,910, రూ. 6,500 మేరకు పెంచిందన్నారు. ప్రస్తుత సీజన్ లో 90 వేల మంది రైతుల నుంచి 1.33 లక్షల టన్నుల కొబ్బరిని కేంద్రం సేకరించిందని, రైతులకు రూ. 1,493 కోట్ల ప్రయోజనం కలిగిందని కేంద్ర మంత్రి వివరించారు. 

త్రిపురలో రూ. 2 వేల కోట్లతో రోడ్డు విస్తరణ 

త్రిపుర రాష్ట్రంలోని ఖోవాయి నుంచి హరినా వరకూ 135 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టుకు మొత్తం రూ. 2,486.78 కోట్లు ఖర్చు కానుండగా, రూ. 1,511.70 కోట్లను లోన్ కాంపోనెంట్ గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి రుణం మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు.

గంగా నదిపై 4.56 కి.మీ. బ్రిడ్జి.. 

బీహార్​లోని దిఘా నుంచి సోనెపూర్ మధ్య గంగానదిపై 4.56 కి.మీ. పొడవున 6 లేన్లతో బ్రిడ్జి నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ఠాకూర్ చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.3,064.45 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ బ్రిడ్జితో ఉత్తర బీహార్​లో వెహికల్స్ రాకపోకలు పెరిగి స్పీడప్ అవుతాయని, ప్రాంతీయంగా అభివృద్ధికి ఊతం లభిస్తుందన్నారు.