
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కు కేంద్ర ప్రభుత్వం లక్షా 64 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీని బీఎస్ఎన్ఎల్ కు అందించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈవిషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు BSNL, భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ ( BBNL) విలీనానికి మంత్రి మండలి ఓకే చెప్పిందన్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి రూ.26 ,316 కోట్లతో 4జీ సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు దేశంలో పట్టణాలకే పరిమితమైన 4జీ సేవలను మారుమూల గ్రామాల్లోనూ అందిస్తామని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఈ ప్యాకేజీని వినియోగిస్తామని స్పష్టం చేశారు. బీఎస్ఎన్ఎల్ కట్టాల్సిన రూ.33,000 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చేస్తామని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దాదాపు అంతే స్థాయిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బ్యాంకు లోన్లను కూడా తక్కువ వడ్డీ బాండ్ల జారీ ద్వారా తీర్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.