
- నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్‌కు ఒక్కొకరికీ రూ.17,951
- 10.9 లక్షల మందికి ప్రయోజనం
- ఇందుకోసం రూ.1,886 కోట్లు కేటాయింపు
- బిహార్‌లో రూ.6 వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
- కొత్తగా 5 వేల మెడికల్ పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని నిర్ణయం
- మెరైన్ ఇండస్ట్రీకి రూ.69 వేల కోట్ల ప్యాకేజీ.. సీఎస్ఐఆర్ స్కీమ్‌కు రూ. 2,277 కోట్లు
- కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైల్వే ఎంప్లాయిస్‌కు కేంద్ర సర్కారు బోనస్ ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ) చెల్లింపునకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు. ఇందుకోసం రూ. 1,886 కోట్లు కేటాయించింది. బోనస్‌ను ట్రాక్ మెయింటెనెన్స్ చేసే వారితోపాటు లోకో పైలట్లు, ట్రాక్ మేనేజర్లు (గార్డ్స్), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్‌మెన్‌లు, రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, ఇతర గ్రూప్ సీ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. 78 రోజులకు గాను ప్రతి నాన్ గెజిటెడ్ ఉద్యోగి గరిష్ఠంగా రూ.17,951 బోనస్ అందుకోనున్నారు. రైల్వే పనితీరు మెరుగు పరిచేందుకు ఈ బోనస్ ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఎన్నికల వేళ బిహార్‌పై వరాల జల్లు
అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌పై కేంద్ర సర్కారు మరోసారి వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్రంలో సుమారు రూ.6 వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.2,192 కోట్లతో భక్తియార్‌పుర్-–రాజ్‌గిర్-–తిలాయియా మధ్య 104 కిలో మీటర్ల దూరం వరకు రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది బిహార్‌లోని 4 జిల్లాలను కవర్ చేస్తుంది. రాజ్‌గిర్ (శాంతి స్తూపం), నలంద, పావాపురి మొదలైన ప్రధాన గమ్యస్థానాలకు రైలు సేవలు మెరుగుపడతాయి. అలాగే, సాహెబ్‌గంజ్–-అరెరాజ్–-బెతియా మధ్య రూ.3,822 కోట్లతో 78.9 కిలో మీటర్ల వరకు 4 లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 139డబ్ల్యూ) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుతో రాజధాని పాట్నా–-బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కాగా, బిహార్ సమగ్ర అభివృద్ధికి తమ సర్కారు కృషిచేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రంలో రహదారులు,
రైల్వేలను వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు.
మెడికల్ సీట్ల పెంపు
దేశంలో వైద్య విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్‌ఎస్) ఫేజ్–3 కింద.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, పీజీ ఇనిస్టిట్యూట్స్‌లో 5వేల పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఒక్కో సీటుపై సుమారు రూ.1.50 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది.
ఇతర నిర్ణయాలు..
దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆమోదం తెలిపింది. మెరైన్ ఇండస్ట్రీకి రూ.69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. ఈ ప్యాకేజీ కింద షిప్‌బిల్డింగ్ ఆర్థిక సహాయ పథకాన్ని 2036 మార్చి 31 వరకు వరకు పొడిగిస్తామని మంత్రి చెప్పారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్‌ఐఆర్) ద్వారా సీఎస్‌ఐఆర్ స్కీమ్‌ను ‘‘కెపాసిటీ బిల్డింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్” పేరుతో ఆమోదించింది. ఇందుకోసం రూ. 2,277.397 కోట్లను కేటాయించింది.