- రూ.20 వేల కోట్లతో నిర్మాణ పనులు
- నాసిక్–సోలాపూర్–అక్కల్కోట్ హై స్పీడ్ కారిడార్
- ఒడిశాలోని ఎన్‌హెచ్ 326 విస్తరణ పనులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి సుమారు రూ.20,668 కోట్ల విలువైన 2 కీలక హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నాసిక్ – సోలాపూర్ – అక్కల్కోట్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా, ఒడిశాలోని ఎన్‌హెచ్ 326ను మరింత విస్తరించేందుకు అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. నాసిక్–సోలాపూర్ 6 లేన్ కారిడార్ అనేది సూరత్ – చెన్నై హై-స్పీడ్ కారిడార్‌లో భాగంగా ఉంటుంది.
374 కిలో మీటర్ల 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కోసం రూ.19,142 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే జర్నీ టైమ్ సగం తగ్గనున్నది. ఇప్పుడు 31 గంటల టైమ్ పడుతోంది. అదే 6 లేన్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కంప్లీట్ అయితే 201 కి.మీ తగ్గి.. 17 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. నాసిక్, అహిల్యానగర్, సోలాపూర్ వంటి నగరాలను కలుపుతూ చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వరకు కనెక్ట్ అవుతది.
కర్నూల్, కడప మీదుగా నేషనల్ హైవే
చెన్నై–సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్, కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనున్నది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరగనున్నది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఈ హై స్పీడ్ నెట్‌వర్క్ ఉపయోగపడనున్నది. రెండో హైవే ప్రాజెక్ట్‌లో భాగంగా ఒడిశాలోని మోహన నుంచి కోరాపుట్ వరకు ఉన్న 2 లేన్ల హైవేను మరింత వెడల్పు చేస్తారు. సుమారు 206 కిలోమీటర్ల హైవే విస్తరణకు రూ.1,526 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇది గజపతి, రాయగడ, కోరాపుట్ వంటి గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు వద్ద ఎన్‌హెచ్30తో కలుస్తుంది. దీనివల్ల పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపడతాయి. కాగా, 2024, జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రూ.12.6 లక్షల నిధులను కేబినెట్ అలకేట్ చేసిందని మంత్రి చెప్పారు.
