ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాంప్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 8న మొదలైన వజ్రోత్సవాలు.. 22 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా  21న.. ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఆగస్ట్ 15న 75 మంది ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డయాలసిస్ పేషంట్స్ కు పెన్షన్ల ఆమోదంపైనా చర్చించనున్నారు. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా..దానికి  కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు సమాచారం. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతోపాటు FRBM పరిధిలోకి బడ్జెట్ వెలుపలి అప్పులను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంతో.. ప్రాజెక్టులు సహా ఇతర అవసరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్  మీటింగ్ లో చర్చించనున్నారు.  స్టేట్ ఓన్ రెవిన్యూ ఎక్కువగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మరో ఎనిమిది జిల్లాల్లో భూములపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో కొన్ని భూములను గుర్తించి అమ్మకాలు జరిపగా..మిగిలి ఉన్న భూములను కూడా అమ్మే విషయంపై కేబినేట్ లో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ విషయంపైనా కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.