
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్లోని మణికొండ RTO ఆఫీస్లో సేవలు రెండు రోజులుగా స్తంభించాయి. ఇంటర్నెట్ సేవలు రాకపోవడంతో మణికొండ ఆర్టీవో కార్యాలయాన్ని అధికారులు మంగళవారం మూసివేశారు. ఇంటర్నెట్ సదుపాయాలు వచ్చిన తర్వాతే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తూ గేటు బయట నోటీసు పెట్టారు.
విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మణికొండ ఆర్టీసీ ఆఫీస్ దగ్గరలోని 5 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ సిబ్బంది కట్ చేశారు. ఈ కారణంగా.. మణికొండ RTO కార్యాలయానికి ఇంటర్నెట్ బంద్ అయింది. ఈ విషయం తెలియక.. మణికొండ ఆర్టీవో ఆఫీస్కు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేకుండా ఉన్న కేబుళ్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి, అవి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పింది. వాటిపై చట్ట ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అంతేగాకుండా అనుమతులున్న కేబుల్ ఏజెన్సీలు అనధికారిక కేబుళ్లను తొలగించడానికి విద్యుత్తు సిబ్బందికి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.