వేలాడుతున్న యమపాశాలు..! ప్రమాదకరంగా కేబుల్, ఇంటర్నెట్, కరెంట్ తీగలు

వేలాడుతున్న యమపాశాలు..! ప్రమాదకరంగా కేబుల్, ఇంటర్నెట్, కరెంట్ తీగలు

 

  •     విద్యుత్​ పోల్స్​కు గుట్టలుగుట్టలుగా చుట్టి పెడుతున్నరు 
  •     చేతికందే ఎత్తులో వేలాడుతున్న తీగలతో పొంచి ఉన్న ప్రమాదం
  •     రామంతాపూర్​ ఘటనతోనైనా మేలుకుంటారా?

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​​లో కరెంట్ తీగలు, ఇంటర్నెట్​​కేబుల్స్, డిష్​కేబుల్స్ ​ప్రమాదరకంగా మారుతున్నాయి. చాలాచోట్ల ప్రమాదాలకు ఇవే కారణమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్​లో జరిగిన ఘటనకు కూడా ఈ వైర్లే కారణమయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కరెంట్​తీగల విషయమే తీసుకుంటే కొన్ని చోట్ల విద్యుత్​ తీగలు చేతికందేంత ఎత్తులోనే ఉండడంతో షాక్​ కొట్టి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ప్రాణాలు 
కోల్పోతున్నారు. 

సికింద్రాబాద్,  ఖైరతాబాద్, చింతల బస్తీ, బోరబండ, రాంనగర్,  పాతబస్తీ ఇలా ఎక్కడ చూసినా పాత స్తంభాలు, చేతికి అందేంత ఎత్తులో కరెంట్ తీగలు కనిపిస్తాయి. పెండ్లిళ్ల బరాత్​లు, పండుగలు, గణేశ్​ఉత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకెళ్లే టైంలో ఎవరికి వారు కర్రలతో వైర్లను పైకి ఎత్తుతుంటారు. ఇలాంటి సందర్భాల్లోనూ కరెంట్​షాక్​ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  వర్షాకాలంలోనూ విద్యుత్ షాక్​ల వల్ల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. భారీ వర్షాల సమయంలో గాలికి కరెంట్ తీగలు తెగిపడడం, తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్ల సమీపంలో నడిచే వారు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

అండర్​ గ్రౌండ్​ కన్నా వేలాడేవే ఎక్కువ 

గ్రేటర్​లో 33కేవీ అండర్​ గ్రౌండ్ ​కేబుల్స్​1,280 కి.మీ. మేరకు ఉండగా,  ఓవర్​ హెడ్​ కేబుల్స్​ లైన్​లు 3,725 కి.మీ. మేరకు ఉన్నాయి. ఈ 33 కేవీ లైన్లు హైటెన్షన్​ కేబుల్స్​గా చెబుతారు. ఇక గృహావసరాలకు ఉపయోగించే 21,643 కి.మీ. ఓవర్‌ హెడ్ కేబుళ్లతో పోలిస్తే అండర్‌ గ్రౌండ్ కేబుల్స్ 957 కి.మీ. మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. అంటే అండర్ గ్రౌండ్​ కన్నా పైన వేలాడుతూ 
వెళ్లే లైన్లే అధికం.  

గ్రేటర్​లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల  ప్రతిపాదన

గ్రేటర్ హైదరాబాద్​లో విద్యుత్ ప్రమాదాల నివారణకు అండర్‌ గ్రౌండ్ కేబుళ్లు వేసే ప్రతిపాదన ఉందని ఎస్పీడీసీఎల్ మెట్రోజోన్ చీఫ్ ఇంజినీర్ జి. ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతామన్నారు. కరెంట్ తీగలు వేలాడినా, తెగిపడినా, స్పార్క్స్ వస్తున్నా 1912కు సమాచారం ఇవ్వాలని, ఊరేగింపుల్లో వైర్లను ఎత్తకుండా విద్యుత్ అధికారులను సంప్రదించాలని సూచించారు. 

వర్షాల్లో ట్రాన్స్​ఫార్మర్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని, సమస్యలు తలెత్తితే స్థానిక విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. అనధికార వ్యక్తులు కరెంట్ తీగలను ఎత్తడం, రిపేర్లు చేయడం సరికాదన్నారు. వినాయక చవితి ఊరేగింపులకు ముందే సమాచారం ఇవ్వాలని, కర్రలతో తీగలను ఎత్తడం, తాకడం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

– జి. ప్రభాకర్, ఎస్పీడీసీఎల్ మెట్రోజోన్  చీఫ్ ఇంజినీర్-