హైదరాబాద్ లో ఆగని కేబుల్ వైర్ల కటింగ్... ఆపరేటర్ల ఆందోళన

హైదరాబాద్ లో ఆగని కేబుల్ వైర్ల కటింగ్... ఆపరేటర్ల ఆందోళన

ఎల్బీనగర్​/ముషీరాబాద్, వెలుగు​: సిటీలో విద్యుత్ శాఖ చేపట్టిన ఇంటర్నెట్, డిష్ టీవీ వైర్ల తొలగింపు కొనసాగుతోంది.  గురువారం పద్మారావునగర్ ప్రాంతంలో ఉదయం నుంచి కరెంట్​ స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను తొలగించారు. ఇంటర్నెట్ కనెక్షన్లు ఆగిపోవడం, టీవీలు మూగబోవడంతో ప్రజలు చిరాకుపడ్డారు. వర్క్​ ఫ్రం హోమ్​ చేస్తున్న ప్రైవేట్​ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. రాంనగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, నాంపల్లి తదితర ప్రాంతాల్లోనూ కేబుల్స్​ను అధికారులు కట్​ చేశారు. 

ఓల్డ్​ సిటీలో ఆపరేటర్ల ఆందోళన..

ముందస్తు సమాచారం లేకుండా కేబుల్, ఇంటర్ నెట్ వైర్లు కట్ చేశారంటూ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట, మీర్​పేటలో సర్వీస్​ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. వైర్లు కట్​ చేయడం వల్ల అనేక సేవలకు అంతరాయం కలుగుతోందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తమకు సమయం ఇవ్వాలని కోరారు.