వీగన్​ వైపు..వేగంగా.. హైదరాబాద్ లో పెరుగుతున్న కెఫేలు, రెస్టారెంట్లు

వీగన్​ వైపు..వేగంగా.. హైదరాబాద్ లో పెరుగుతున్న కెఫేలు, రెస్టారెంట్లు
  •    యూత్​ ఎక్కువగా వీగన్​ఫుడ్ పై ఇంట్రెస్ట్  
  •     వెజ్ లోనూ పలు రకాల ఫుడ్ వెరైటీస్​
  •     నాన్ వెజ్ కు సమానంగా ఫైబర్, ప్రోటీన్స్ 

హైదరాబాద్​, వెలుగు :  సిటీలో  వీగన్స్​ పెరిగిపోతున్నారు. ఈ డైట్​ను ఎక్కువమంది ఫాలో అవుతున్నారు. రెగ్యులర్ గా తినే కూరగాయలు, ఆకు కూరలను వీగన్స్ స్ర్టిక్ట్​గా తీసుకుంటుంటారు. జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన పదార్థాలు, వస్తువులను తీసుకోని, వాడని వాళ్లను వీగన్స్ గా పరిగణిస్తుంటారు.  వీరికోసం రెస్టారెంట్స్​కూడా ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కెఫేలు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. 

పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్స్​

జంతువులకు హాని తలపెట్టడం, వాటిపై క్రూరత్వం చూపడం, పర్యావరణానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని తీసుకోకపోవడమే వీగనిజం. దీనికోసం ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు. మాంసం, పాల ఉత్పత్తులతో తయారైన ఉత్పత్తులను తీసుకోకుండా ఉండేవారు. ఆకు కూరలు, కూరగాయలను తీసుకోవడమే వీగనిజం. ఇలాంటి ఫుడ్​తీసుకుంటే  సరైన ప్రోటీన్స్​అందవనే అపోహ ఉంటుంది. కానీ మాంసం, పాలు తీసుకోకుండా కూడా ప్రోటీన్స్, ఫైబర్​అదేస్థాయిలో అందుతాయి. బచ్చలికూర, పాలకూర, బఠానీలు, సోయా, బ్రౌన్​ రైస్​, హోల్​వీట్​బ్రెడ్​లాంటి ప్రొడక్ట్స్​నుంచి ఎక్కువ స్థాయిలో ఫైబర్, ప్రోటీన్​లు సమకూరుతాయి. బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు తదితర వాటి నుంచి డైరీ ఉత్పత్తులకు ఆల్టర్నేటివ్​గా తీసుకుంటారు. వీగన్​ఫుడ్​ఇన్సులిన్, ఫైబర్​స్థాయిని కూడా పెంచుతుందని, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులు రావని నిపుణులు చెబుతున్నారు. 

డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ 

వీగన్  ఫుడ్​ డైట్​తో సిటీలో పదుల సంఖ్యలో కెఫేలు, రెస్టారెంట్స్​ఉన్నాయి. నాన్​వెజ్​ఐటమ్స్​కు ఏమాత్రం తీసిపోని విధంగా వీగన్​ఫుడ్​ను అందుబాటులో ఉంచుతారు రెస్టారెంట్స్​నిర్వాహకులు. వీగన్​పిజ్జాలు, సీడ్స్ నుంచి తీసిన మిల్క్ తో ఐస్​క్రీమ్స్​, నానో చీజ్ సాస్​, ఓట్ సాస్​కేక్స్​, వీగన్​బటర్​, పీనట్ బటర్, ఫ్రెష్​సమ్మర్ రోల్స్​, క్రిస్పీ మోక్​చికెన్​65, స్ట్రాబెరీ మౌజీ కేక్​, బేక్డ్​జావెట్​పొటాటోస్ తదితర వీగన్ ఫుడ్స్ రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి.  వీగన్స్​ సంఖ్య కూడా పెరిగిపోతుందని  కెఫే, రెస్టారెంట్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ డైట్​ను యూత్​ ఎక్కువగా ఫాలో అవుతున్నారంటున్నారు.  అందుకు తగినట్టుగా రెస్టారెంట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.  

ప్రజల్లో అవేర్​నెస్​ రావాలి 

12 ఏండ్ల కిందట వీగన్​గా మారా. యానిమల్స్ పై  అమితమైన ప్రేమే ఇందుకు కారణం. నా తర్వాత ఇంట్లో వాళ్లు కూడా వీగన్స్​అయ్యారు. ఇది ఎవరి కోసమో కాదు. మన హెల్త్ కోసం. దీనిపై ప్రజల్లో అవేర్​నెస్​ రావాలి. వీగన్​గా మారడం ఆరోగ్యకరం కూడా. ఈ ఫుడ్​లో కొలెస్ట్రాల్​ ఉండదు. గుండె జబ్బులు దరిచేరవు.  
- దీపిక,  వీగన్​

నేచురల్​ బాడీ బిల్డర్​ను.. 

చిన్నప్పటి నుంచే నాన్​వెజ్​ తినను. 14 ఏండ్ల వయసు నుంచి  డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవడం ఆపేశా. బాడీ బిల్డింగ్ నా డ్రీమ్.  వీగన్​గా సాధించలేవు అని చాలామంది నిరుత్సాహ పరిచారు. కానీ ఏండ్ల పాటు కష్టపడి సాధించా. నేచురల్ ​బాడీ బిల్డర్​గా ఎన్నో పతకాలు సాధించా. నాన్​వెజ్​, సప్లిమెంట్స్​తీసుకోకుండా 30 రకాల నట్స్​, 32 రకాల పప్పులతో చేసిన పౌడర్స్​ను తీసుకుంటున్నా. 
- వెంకట్, వీగన్ ​బాడీ బిల్డర్