
అజ్మాన్: ఆ సిటీలో పేదలకు పెట్రోల్, డీజిల్ ఉచితం.. అవును నిజంగా నిజం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అజ్మాన్ నగరంలో నిరుపేదలకు పెట్రోల్, డీజిల్ ఉచితంగా అందించే కార్యక్రమం ప్రారంభమైంది. కార్ల సర్వీసింగ్, పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ సంస్థ అయిన సీఏఎఫ్‌యూ(CAFU) సంస్థ నిరుపేదలకు ఉచిత పెట్రోల్, డీజిల్ అందించేందుకు ముందుకొచ్చింది. యూ అల్ ఇషాన్ ఛారిటీ సంస్థతో చేతులు కలిపి ఈ ఉచిత ఇంథన సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దుబాయ్ హెల్త్ అథారిటీ సహకారంతో కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ అందిస్తున్న సంస్థ తాజాగా నిరుపేదలకు కూడా ఉచిత ఇంధనం అందించాలని నిర్ణయించింది.
ఉచితంగా ఇస్తామని ప్రకటించడానికి ముందే కార్యక్రమం కోసం సీ ఏ ఎఫ్ యూ సంస్థ 8 ట్రక్కుల ఇందనాన్ని రెడీ గా ఉంచి తొలిరోజున దాదాపు 100కుపైగా పేద కుటుంబాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ అందించింది. ఈ సందర్భంగా సీఏఎఫ్‌యూ వ్యవస్థాపకుడు, సీఈఓ రషీద్ అబ్దుల్లా అహ్మద్ అల్ ఘౌర్ మాట్లాడుతూ అవసరమైన వారికి సహాయపడాలనేది సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు. నిరుపేదలకు మేలు చేసే ఈ కార్యక్రమం కోసం అల్ ఇషాన్ ఛారిటీ సంస్థ తో కలసి నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యత, సేవా భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వచ్ఛంద సంస్థ సిఇఒ షేక్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ రషీద్ అల్ నువైమి మాట్లాడుతూ తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు, వ్యక్తులకు చేయూతనిచ్చే ఇచ్చే ప్రయత్నాలను కొనసాగించడానికి భాగస్వాములతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సీఏఎఫ్‌యూను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.