అభివృద్ధి.. సంక్షేమానికి నిధులేవి ?...2024-25 అకౌంట్స్పై కాగ్ ఫైర్

అభివృద్ధి.. సంక్షేమానికి నిధులేవి ?...2024-25 అకౌంట్స్పై కాగ్ ఫైర్
  •     ఆదాయంలో 49 శాతం జీతాలు, పింఛన్లు, వడ్డీలకే
  •     రూ.71 వేల కోట్ల ఖర్చు చేయలేకపోయిన సర్కార్‌

హైదరాబాద్​ , వెలుగు: రాష్ట్ర ఖజానాకు వచ్చే ప్రతి రూపాయిలో దాదాపు సగం జీతాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులకే వెళ్తుండడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని కాగ్  ప్రశ్నించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2022-–23లో రాబడిలో 43 శాతం మాత్రమే కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‌గా ఉండగా, ఇప్పుడు 49 శాతానికి పెరిగిందని తెలిపింది. 

జీతాలు, పింఛన్లు, వడ్డీల రూపంలో 2020-–21లో రూ.55,206 కోట్లుగా ఉన్న భారం, 2021–-22లో రూ. 63,561 కోట్లకు, 2023–--24లో రూ. 75,456 కోట్లకు పెరిగి, ఇప్పుడు రూ.82,266 కోట్లకు చేరిందని పేర్కొంది. ఇందులో జీతాల కోసం రూ. 24,770 కోట్ల నుంచి రూ.37,521 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ. 16,841 కోట్ల నుంచి రూ.27,803 కోట్లు, పింఛన్లకు ఐదేండ్ల కింద రూ. 13,595 కోట్లు ఖర్చవ్వగా,  ప్రస్తుతం రూ.16,942 కోట్లు ఖర్చవుతున్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులు కుంటుపడటం సహజమేనని హెచ్చరించింది. బడ్జెట్‌లో చూపించిన అంకెలకు, వాస్తవ ఖర్చులకు మధ్య భారీ అంతరం ఉందని కాగ్ ఎత్తిచూపింది. దీంతో సామాన్యుడి సంక్షేమం, అభివృద్ధి పనులకు నిధులు కరువై రాష్ట్రం ఆర్థికంగా కునరిల్లుతోందని కాగ్​హెచ్చరించింది.