పాలమూరు ప్రాజెక్ట్.. లెక్కలు తీస్తున్న కాగ్

పాలమూరు ప్రాజెక్ట్..  లెక్కలు తీస్తున్న కాగ్

హైదరాబాద్, వెలుగు:  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లెక్కలపై కాగ్ ఆరా​ తీస్తోంది. శుక్రవారం నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అంశాలను పరిశీలించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ దాకా లెక్కలు వివరాలు తీయనున్నట్లు తెలిసింది. భూసేకరణ, పునరావాసం,  పునర్ నిర్మాణంతో పాటు రిజర్వాయర్ల నిర్మాణం, కాలువలు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పంప్ హౌస్ నిర్మాణం, సివిల్ పనుల కోసం 2023 మార్చి దాకా చేసిన ఖర్చుల  వివరాలను కాగ్​ ఆడిట్​ చేయనుంది. 

ఇప్పటికే ఈ వివరాలను తీసుకున్న కాగ్.. వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను జల్లెడ పడుతోంది. రాష్ట్ర బడ్జెట్లో  కేటాయింపులెన్నీ? ఖర్చుచేసిందెంత..?  అప్పుగా ఎన్ని తీసుకున్నారు..? ఇప్పటిదాకా రుణాల్లో ఎంత మేర ఖర్చు చేశారు..? మొత్తం వ్యయం ఎంత..? వంటి వివరాలను ప్రభుత్వం నుంచి కాగ్ ఇప్పటికే  వివరాలు కోరింది.  

పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నివేదికతో పాటు ఎప్పట్లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది ? ఇబ్బందులు ఏమున్నాయి..? వంటి వివరాలు కూడా సేకరిస్తున్నది. రోజుకు 2 టీఎంసీలను 60 రోజుల్లో తరలించేలా 120 టీఎంసీల సామర్థ్యంతో రూ.55,086 కోట్ల వ్యయంతో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడుతున్న విషయం తెలిసిందే.