- లిస్ట్‌లో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ కార్పొరేషన్, టీవర్క్స్ సంస్థలు
- మూడేండ్లుగా 49 సంస్థల అకౌంట్లు అప్డేట్ లేవు.. తెల్ల ఏనుగులుగా మారిన 16 సంస్థలు
- ప్రభుత్వ సంస్థల తీరును కడిగి పారేసిన ‘కాగ్’.. నష్టాల్లో ఉన్న సంస్థలపై ప్రభుత్వం
- సమగ్ర సమీక్ష చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 83 సంస్థల తీరుతెన్నులను పరిశీలిస్తే అందులో తొమ్మిది కీలక సంస్థల నెట్ వర్త్ అంటే ఆస్తుల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. వీటిలో ఏకంగా రూ.50,930 కోట్ల మేర లోటు ఉండటం పాలకుల ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి నిదర్శనమని మండిపడింది. కేవలం 17,921 కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడి ఉన్న ఈ సంస్థల్లో నష్టాలు ఆ పెట్టుబడిని మించిపోయి అగాధంలోకి వెళ్లేలా చేశాయని తెలిపింది.
ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థల్లో సగానికి పైగా లెక్కలు చెప్పకపోవడం, బాధ్యతాయుతమైన ఆడిట్ వ్యవస్థను పక్కనబెట్టి, ఇష్టారాజ్యంగా సాగుతున్న దివాలా పాలన తీరును కాగ్ గణాంకాలతో సహా ఎండగట్టింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఖజానాపై కోలుకోలేని భారం పడుతుందని హెచ్చరించింది. ఈ దుస్థితికి ప్రధాన కారణం సంస్థల నిర్వహణలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యమేనని కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉండాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు.. పాలకుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల పతనావస్థకు చేరుకున్నాయని కాగ్ తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొని నష్టాల్లో ఉన్న సంస్థలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కాగ్ సూచించింది. అకౌంట్స్ ఫైనలైజేషన్ కోసం సంబంధిత శాఖలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని, విజిలెన్స్ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని కోరింది.
పనితీరు మెరుగుపడని, నిరుపయోగంగా ఉన్న 16 ఇన్ యాక్టివ్ సంస్థలను మూసివేయడమో లేదా పునరుద్ధరించడమో చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తే భావి తరాలకు తీరని అన్యాయం చేసిన వారమవుతామని హెచ్చరించింది. బాధ్యులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించింది.
మూడేండ్లుగా 49 సంస్థల అకౌంట్లు అడ్రస్ లేవు
రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. వాటిలో జవాబుదారీతనం ఏ స్థాయిలో ఉందో కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. ‘‘ఏకంగా 49 సంస్థలు గడిచిన మూడేండ్లుగా తమ వార్షిక ఖాతాలను ఆడిట్ కు సమర్పించకుండా కాలయాపన చేస్తున్నాయి. 2023 సెప్టెంబర్ నాటికి ఈ సంస్థలు లెక్కలు చెప్పకపోవడంతో వాటి అసలు ఆర్థిక స్థితి ఏంటో ప్రజలకు తెలియకుండా పోయింది. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్లు తమ పరిధిలోని సంస్థలపై పర్యవేక్షణ ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యాయి”అని కాగ్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఖాతాలను ఫైనలైజ్ చేయాల్సి ఉన్నా.. ఆ ఊసే లేకపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా మారింది. ఈ జాప్యం వల్ల నిధుల దుర్వినియోగానికి, భారీ అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని ఆడిట్ హెచ్చరించింది. ‘‘ఆడిట్ పరిధిలోకి వచ్చిన 18 ప్రధాన సంస్థల్లో తొమ్మిది సంస్థల నెట్ వర్త్ (ఆస్తుల విలువ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ తొమ్మిది సంస్థల్లో ఏకంగా రూ. 50,930 కోట్ల మేర లోటు ఉంది.
ప్రభుత్వం ఈ సంస్థల్లో పెట్టిన రూ. 17,921 కోట్ల ఈక్విటీ పెట్టుబడి ఆవిరైపోవడమే కాకుండా, అవి తీరని అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నష్టాల తీవ్రత వల్ల సంస్థల ఉనికికే ముప్పు ఏర్పడింది. పేరుకు ప్రభుత్వ సంస్థలైనా, వాస్తవానికి ఇవి తెల్ల ఏనుగులుగా మారి రాష్ట్ర ఖజానాకు శాపంగా పరిణమించాయి”అని విశ్లేషించింది. నెట్ వర్త్ పూర్తిగా కోల్పోయిన ఆ 9 సంస్థల పేర్లను కాగ్ నివేదిక బహిర్గతం చేసింది. ఇందులో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ వంటి సంస్థలు ఉన్నాయి.
అలాగే, ది నిజాం షుగర్స్ లిమిటెడ్, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, టి-వర్క్స్ ఫౌండేషన్, దామోదర మినరల్స్ సంస్థల ఆస్తులు పూర్తిగా హరించుకుపోయాయని, ఈ సంస్థలు తమ మనుగడ సాగించాలంటే భారీ ఎత్తున ప్రభుత్వ నిధులు అవసరమని, లేనిపక్షంలో ఇవి శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
కార్పొరేట్ గవర్నెన్స్ గాలికి.. డైరెక్టర్ల నియామకంలో తీవ్ర జాప్యం
పనిచేస్తున్న 18 కీలక సంస్థల ఆర్థిక పనితీరును విశ్లేషిస్తే, నష్టాల ఊబి ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. కేవలం 6 సంస్థలు మాత్రమే రూ.3,857 కోట్ల స్వల్ప లాభాలను ఆర్జించగా, మిగిలిన 11 సంస్థలు ఏకంగా రూ. 11,969.66 కోట్ల భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. అంటే లాభం కంటే నష్టం దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. విద్యుత్ రంగం లోని డిస్కమ్ లు ఈ నష్టాల్లో సింహభాగాన్ని ఆక్ర మిస్తున్నాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరగ డం, అస్తవ్యస్తమైన ఆర్థిక ప్రణాళికలే ఈ నష్టాల కు మూలమని కాగ్ ఎత్తిచూపింది.
‘‘జీఎస్డీపీ లో ఈ సంస్థల టర్నోవర్ కేవలం 7.25 శాతానికే పరిమిత మైంది. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత ఉండా లంటే స్వతంత్ర డైరెక్టర్ల పాత్ర కీలకం. కానీ, తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పూర్తిగా విస్మరించింది. 15 కీలక సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం జరగక పోగా, ఆరు సంస్థల్లో కనీసం ఒక మహిళా డైరె క్టర్ కూడా లేకపోవడం గమనార్హం.
బోర్డు సమా వేశాల్లో 100 శాతం డైరెక్టర్ల హాజరును నిర్ధారిం చడంలోనూ విఫలమయ్యారు. కీలకమైన ఆడిట్ కమిటీలు లేని సంస్థలు కూడా 5 ఉండటం చూస్తుంటే విజిలెన్స్ వ్యవస్థను ప్రభుత్వం ఎంత గా నీరుగార్చిందో అర్థమవుతోంది’’అని కాగ్ తెలిపింది. పర్యవేక్షణ లేని కారణంగానే సంస్థల్లో అరాచకాలు సాగుతున్నాయని, బాధ్యతాయు తమైన నియామకాలు చేపట్టకుండా సంస్థల పునరుద్ధరణ అసాధ్యమని కాగ్ స్పష్టమైన సిఫార్సు చేసింది.
