క్యాసినోలో 16 మంది సజీవ దహనం

క్యాసినోలో 16 మంది సజీవ దహనం

నామ్‌‌పెన్‌‌: కంబోడియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. థాయ్‌‌లాండ్‌‌కు సరిహద్దులో ఉన్న పోయిపేట్‌‌లోని గ్రాండ్‌‌ డైమండ్‌‌ సిటీ హోటల్‌‌, క్యాసినోలో మంటలు చెలరేగడంతో 16 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్‌‌లో ఉన్న వాళ్లలో కొంతమంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల్లోంచి దూకడం వీడియోలో కనిపించింది. మరికొంత మంది బాధితులు 13, 14, 15 అంతస్తుల నుంచి చేతులు ఊపుతూ, మొబైల్‌‌ ఫోన్ల ఫ్లాష్‌‌ లైట్లను వేస్తూ కాపాడాలని ఫైర్‌‌‌‌ సిబ్బందికి సిగ్నల్‌‌ ఇచ్చారు. మంటలు చెలరేగిన కొద్ది సేపటికే క్యాసినో మొత్తం మంటలు వ్యాపించాయని ప్రావిన్స్‌‌ డిప్యూటీ గవర్నర్‌‌‌‌ అన్నారు. 

మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌‌కు తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగినప్పుడు క్యాసినోలో 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. చాలా మంది టూరిస్టులు ఇంకా లోపలే చిక్కుకుపోయారు. సమాచారం తెలియగానే థాయ్‌‌లాండ్‌‌ నుంచి ఫైర్‌‌‌‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. డెడ్‌‌బాడీలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.