ఒక్కరోజులోనే రాజీనామా ఆమోదం.. మరుసటి రోజే కేసు

ఒక్కరోజులోనే రాజీనామా ఆమోదం.. మరుసటి రోజే కేసు
  • నా వెనకాల ఎవరూ లేరని ధైర్యమా..?
  • ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. కేసులకు భయపడేది లేదు
  • అన్యాయాలను ప్రశ్నించడానికి బయటకు వచ్చా..
  • త్వరలోనే నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటా
  • మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

సూర్యాపేట: ‘‘ఒక్కరోజులోనే రాజీనామా ఆమోదం.. మరుసటి రోజే కేసు పెట్టారు.. నా వెనకాల ఎవరూ లేరని ధైర్యమా..? ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. కేసులకు భయపడేది లేదు.. అన్యాయాలను ప్రశ్నించేందుకే వీఆర్ఎస్ ఇచ్చి బయటకు వచ్చేశా..’’ నని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్  అన్నారు. సూర్యాపేటలో జరిగిన బహుజన ఉద్యోగుల సమావేశంలో మాజీ ఐపీఎస్ అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ ఎందుకు ఉద్యోగం వదిలిపెట్టాడో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మన బిడ్డలకు గౌరవం బహుజన రాజ్యంతోనే సాధ్యం, అనాదిగా దోపిడీకి , అన్యాయానికి గురైన వర్గాల కోసమే నా పోరాటం, బహుజన సమాజంలో అసమానతలు ఉండవని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలకు అంబేద్కర్ కు పూలమాల వేసాడు..  సంతోషం.. 31 మంది ఎమ్మెల్యేలు తమ వర్గాల గురించి మాట్లాడడంలేదు, బహుజన రాజ్యం ఒక్క ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యం కాదు అందరూ సైనికుల్లా ఉద్యమించాలన్నారు. 
ఒక్కడు కాదు అందరూ ప్రవీణ్ లే.. అందరి మీద కేసులు పెట్టమని అడగండి
‘‘దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క రోజులో రాజీనామా ను ఆమోదించారు.. సంతోషం.. మరుసటి రోజే కేసు పెట్టారు.. ప్రవీణ్ వెనకాల ఎవరూ లేరని ధైర్యమా, లేక ఎవరూ ఉండకూడదనా.. ? ఒక్కడు కాదు అందరూ ప్రవీణ్ లే.. అందరిమీద పెట్టండి అని అడగండి..’’ అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఎన్ని కేసులు పెట్టడతారో పెట్టండి.. నేను భయపడను.. ఆ గోస నుండి బయటపడాలనే రాజీనామా చేశా.. అన్యాయాలను ప్రశ్నించడానికే బయటకు వచ్చా.. నేను చేసిన  త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లండి.. ఎవరిని అడుక్కోవలసిన అవసరం లేకుండా మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం..’’ అని ఆయన పిలుపునిచ్చారు. 
బహుజన రాజ్యం కోసం ఆర్ధికంగా ఆదుకోండి
నాకు ఫార్మ్ హౌస్ లేదు.. ఆస్తులు లేని నన్ను బహుజన రాజ్య స్థాపన కోసం ఆర్థికంగా ఆదుకోండి.. నేను ఎవరినీ మోసం చేయను.. బహుజన అధికార నిధి కోసం అందరూ తమ సహకారాన్ని అందించాలి.. అక్రమ ఆస్తులతో ప్రజలను వంచిస్తున్నారు , ఓట్లను కొని మోసం చేస్తున్నారు.. బహుజన రాజ్యం కోసం అందరూ నిజాయితీగా వ్యవహరించాలి.. ఓట్లను అమ్ముకోవొద్దు.. వందలాది మందిని బహుజన రాజ్యం కోసం సమీకరించాలి.. తొందర్లోనే చారిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటా.. త్యాగాల పునాదుల మీదనే బహుజన రాజ్యం ఏర్పడుతుంది..’’ అని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొక్కరు సుఖ పడుతున్నారని అన్నారు.