బీఆర్ఎస్‎లో మరో సంక్షోభం.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు..!

బీఆర్ఎస్‎లో మరో సంక్షోభం.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు..!

= కాషాయకండువా కప్పుకొనే ఏర్పాట్లు!!

= నిన్న గువ్వల, అబ్రహం రాజీనామా
= జాయినింగ్స్ లో  బీజేపీ వంతు స్టార్ట్
= ఈ నెల 9న నలుగురు కమలం పార్టీలోకి?
= చేరేవారిలో ఆపరేషన్ ఫాంహౌస్ ఎమ్మెల్యేలు?
= గులాబీ పార్టీని షేక్ చేస్తున్న కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ రేసింగ్
= దార్లు వెతుక్కుంటున్న మరికొందరు

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీ పార్టీకి మరో సంక్షోభం వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన పది మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్‎కు రాజీనామా చేశారు. వీరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆపరేషన్ ఫాంహౌస్ కేసులో చిక్కిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు  బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి కూడా పార్టీలో బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

అదే విధంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బీజేపీ కీలక నేతల బీఎల్ సంతోష్  సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనేందుకు రెడీ అయిపోయారని సమాచారం. వీరిలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. రెండో దఫాలో మరో ఆరుగురు బీజేపీలో చేరుతారని సమాచారం. 

అయితే బీజేపీతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ ఫాంహౌస్ కేసులో పాల్గొన్న నేతలంతా బీఎల్ సంతోష్‎తో మంతనాలు సాగించినట్టు టాక్. తమంతట తాము బీఎల్ సంతోష్ పేరు చెప్పలేదని, అంతా కేసీఆర్ చెప్పినట్టుగానే చేశామని వారు బీఎల్ సంతోష్‎కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. రెండో దఫా జాయినింగ్స్‎లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కారు దిగుతారని సమాచారం.  
 

కేటీఆర్ ఢిల్లీ టూర్‎పై ఆసక్తి

ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్‎గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి బయల్దేరి వెళ్లినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ ఇటీవలే ఏపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ బీజేపీలో బీఆర్ఎస్‎ను విలీనం చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించలేదు. నిన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వాళ్లు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్ విస్తృతంగా వచ్చేసింది. ఈ తరుణంలో ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఎవరిని కలువబోతున్నారనేది హాట్ టాపిక్‎గా మారింది.