తెలంగాణలో ముగిసిన ప్రచారం... 95 సభల్లో కేసీఆర్.. 87 సభల్లో రేవంత్

తెలంగాణలో ముగిసిన ప్రచారం... 95 సభల్లో కేసీఆర్.. 87 సభల్లో రేవంత్
  • 95 సభల్లో కేసీఆర్.. 87 సభల్లో రేవంత్
  • రాష్ట్రమంతటా పోటాపోటీగా సుడిగాలి పర్యటనలు  
  • 25 సభల్లో రాహుల్​.. 26 సభల్లో ప్రియాంక ప్రచారం   
  • మోదీ 8.. అమిత్ షా 16 మీటింగ్​లకు హాజరు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు బంద్‌‌ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 9న షెడ్యూల్ వెలువడగా.. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారం ఊపందుకుంది. మొత్తం119 నియోజకవర్గాలకుగాను.. ఏజెన్సీ ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలతో, మిగతా 106 సెగ్మెంట్లలో 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో 30వ తేదీన పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రమంతటా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే తిరిగి వెళ్లిపోయారు. ప్రచారంలో ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా సుడిగాలి పర్యటనలు చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టు 21న బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. అక్టోబర్15న హుస్నాబాద్​ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 31 రోజుల్లో  రాష్ట్ర వ్యాప్తంగా 95 సభల్లో పాల్గొన్నారు. గజ్వేల్ సభతో ప్రచారం ముగించారు.  రేవంత్ రెడ్డి 63 నియోజకవర్గాల్లో 87 సభలకు హాజరయ్యారు.

అక్టోబర్ 16న వికారాబాద్​లో ప్రచారం మొదలుపెట్టి, మల్కాజ్​గిరి రోడ్​షోతో ముగించారు. కేటీఆర్​60 రోజుల్లో 70 రోడ్​ షోలలో పాల్గొన్నారు. 30 పబ్లిక్​ మీటింగుల్లో ప్రసంగించారు. వివిధ వర్గాలతో సమావేశాలు పెట్టి మాట్లాడారు. 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్​లు నిర్వహించారు. హరీశ్​రావు 60 రోజుల్లో 90కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో, రోడ్​ షోలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత 70కి పైగా ప్రచార సభలు, రోడ్​ షోల్లో ప్రచారం చేశారు.    

రాహుల్ గాంధీ 15 నియోజకవర్గాల్లో 25 సభలు.. ప్రియాంక అన్నే సెగ్మెంట్లలో 26 సభల్లో పాల్గొన్నారు. ఖర్గే నాలుగు నియోజకవర్గాల్లో 10 సభల్లో పాల్గొన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య 4 సభలు, చత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్ 4 సభలకు హాజరయ్యారు. ఇక కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 9 సభల్లో పాల్గొన్నారు. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా ప్రచారం చేసిన రాహుల్, ప్రియాంక గాంధీలు..

చివరి రోజున ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తరఫున రేవంత్​తో కలిసి వారిద్దరూ భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్, ప్రియాంక, రాహుల్ సెల్ఫీలు తీసుకున్నారు.  

మోదీ 8.. నడ్డా 14 సభల్లో.. 

ప్రధాని మోదీ 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీసీ ఆత్మగౌరవ సభ, ఎస్సీ వర్గీకరణ సభల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత మూడు రోజులు ఇక్కడే మకాం వేసి రోజుకు రెండు సభల్లో పాల్గొన్నారు. చివరగా హైదరాబాద్ లో రోడ్డు షోతో ప్రచారం ముగించారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా 14 సభల్లో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా16 సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి 8 సభల్లో,  అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 13 సభల్లో

మహారాష్ట్ర సీఎం షిండే 3 సభల్లో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ 6 సభల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ఇతర జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, రఘునందన్ రావు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.