- తలసరి ఆదాయం రూ.3.8 లక్షలు
- గత ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం వృద్ధి
- బ్రిక్ వర్క్ రేటింగ్స్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని, ఏటా 12-–13శాతం వృద్ధి దిశగా ఎకానమీ పయనిస్తోందని వెల్లడయింది. హైదరాబాద్లో మంగళవారం బ్రిక్ వర్క్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ...భారీ పెట్టుబడుల వల్ల రియల్ జీడీపీ పెరుగుతోంది. 13 శాతం వరకు వృద్ధి రావాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం. 2025లో భారత సగటు వృద్ధి 6.5శాతం కాగా, తెలంగాణ 8.1శాతం సాధించింది. ధరలు తగ్గడం, జీఎస్టీ రేట్ల కోత వల్ల రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.01శాతంగా నమోదయింది. ఇది దేశంలోనే అతి తక్కువ! రూ.3.8 లక్షల తలసరి ఆదాయంతో మనరాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ, ఫార్మా రంగాలు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వ్యాపార అనుకూల విధానాల వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం ఎగుమతి రంగాలపై కొంత ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ యూరప్, రష్యా దేశాలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఎగుమతులను పెంచుతాయి. ఆర్బీఐ రేట్ల కోత, మెరుగైన లిక్విడిటీ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరింత బాగుంటుందని రిపోర్టు తెలిపింది.
ప్రభుత్వ విధానాలు భేష్
ఈ సందర్భంగా బ్రిక్ వర్క్ రేటింగ్స్ సీఈఓ మనూ సెహగల్ మాట్లాడుతూ ‘‘ తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఫార్మా, మౌలిక సదుపాయాల రంగాలపై భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా సేవల రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద దిక్కుగా నిలిచింది. రాష్ట్ర మొత్తం ఆదాయంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఈ రంగం నుంచే వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల కొత్త పెట్టుబడులు సులువుగా వస్తున్నాయి. తెలంగాణలో నైపుణ్యం ఉన్న యువత, తక్కువ వడ్డీకే లోన్లు దొరికే ఆర్థిక వాతావరణం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయి. ఈ కారణాల వల్ల 2026లో తెలంగాణ ఆర్థికంగా మరింత ఎదగనుంది”అని వివరించారు.
